బీహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్డీఎ కూటమిలోకి జెడియు చేరనున్న నేపథ్యంలో నితీశ్‌కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ నేటి ఉదయం ఉత్తర్వులను జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్-1 స్థాయి అధికారులను నితీశ్ కుమార్ సర్కార్ ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక, బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లు ఉండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసులు(ఎస్పీ) ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నితీశ్ కుమార్ సర్కార్ నియమించింది.
కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో జత కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడంతో నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి ఏన్డీయే కూటమిలోకి వెళ్లేందుకు సంకేతాలుగా చెబుతున్నారు.