న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు నిధులతో బంగారు గనిలా పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో సింగరేణిలో వచ్చిన మార్పులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి.. రాజకీయ అవసరాలకోసం సింగరేణిని బలిచేయడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటైందని అన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉన్నప్పటికీ.. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
కల్వకుంట్ల కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల మితిమీరిన జోక్యం కారణంగా సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఉద్యోగాలను గణనీయంగా తగ్గించడం, ఆర్థిక పరిస్థితి పతనం, భద్రతాపరమైన లోపాలు వంటి అంశాలు మొత్తం వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చేశాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. సింగరేణి సంరక్షణ నినాదమిచ్చిన కల్వకుంట్ల కుటుంబం.. ఇప్పుడు సంరక్షణ లేకపోగా సింగరేణి నిధుల భక్షణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రూ.3,500 కోట్ల మిగులు నిధులతో ఉన్న సింగరేణి 2023 జనవరి వరకు రూ.10వేల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణాలేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఓవైపు సింగరేణి టర్నోవర్ పెరుగుతున్నా లాభాలు పెరగకపోవడానికి గల కారణాలేంటో కూడా చెప్పాలని నిలదీశారు. అప్పులు చేయకుండా ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కన్నా 10రెట్లు పెద్దదైన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)కు ప్రస్తుతం రూ.12వేల కోట్ల అప్పులుంటే.. సింగరేణికి రూ.10వేల కోట్లు అప్పులున్నాయని తెలిపారు. కోల్ ఇండియా సంస్థలో పనిచేసే కార్మికుడికి రోజుకు రూ. 930 అందుతుంటే సింగరేణిలో కేవలం రూ. 420 మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ప్రతి అంశంలోనూ రాజకీయ జోక్యం పెరగడం కారణంగా.. ఒకప్పుడు తెలంగాణకు తలమానికంగా ఉన్న సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, నానాటికీ సమస్యలు ఎక్కువవుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు ప్రొటోకాల్ కోసం ఏకంగా సర్క్యులర్ జారీ చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సింగరేణి వ్యవస్థను పతనావస్థకు తీసుకెళ్తున్న కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు.. ఈ సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు దీనిపై పలుమార్లు వివరణ ఇచ్చినా.. కల్వకుంట్ల కుటుంబం కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా బహిరంగ వేలం ద్వారానే గనుల వేలం జరుగుతున్న విషయాన్ని కల్వకుంట్ల కుటుంబం మరిచిపోయినట్లుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలం విషయంలో దేశమంతా ఒకే విధానాన్ని ఫాలో అవుతున్నట్లు ఆయన గుర్తుచేశారు.
సింగరేణి వ్యవస్థను అస్తవ్యస్థం చేసిన కల్వకుంట్ల కుటుంబం.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెడతామంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మోసం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. నిజానికి సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ నిధులే రూ. 25 వేల కోట్లకు చేరుకున్నాయని, వాటిని చెల్లించకుండా ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీఎస్‌జెన్కో రూ. 2,500 కోట్లు, ట్రాన్స్‌కో రూ. 18 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. అలాగే బొగ్గువినియోగదారులు కూడా సింగరేణికి బకాయిపడ్డారని చెప్పారు. సింగరేణిలో అధికార దుర్వినియోగానికి రెడ్ కార్పెట్ పరిచారని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కార్మికుల షిఫ్టులు మార్చాలన్నా సరే అధికార పార్టీ నేతల అనుమతి తప్పనిసరైందని ఉదహరించారు. సింగరేణిని బీఆర్ఎస్ తన జేబు సంస్థగా మార్చుకుందని ఆరోపించారు. సింగరేణిని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి గొప్ప మైనింగ్ కంపెనీగా తయారుచేస్తామని చెప్పిన కేసీఆర్, సంస్థలో కార్మికుల శ్రమదోపిడీ చేస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.