హైెదరాబాద్, ఆంధ్రప్రభ : థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి సంస్థ మరో రికార్డును సొంతం చేసుకున్నది. అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించి..ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ( ఏప్రిల్ నుంచి డిసెంబరు 31 నాటికి) మరోసారి దేశంలోనే నెంబర్ వన్ స్థానంతో తన ప్రతిభను నిరూపించుకున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథార్టీ రూపొందించిన అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో అత్యధికంగా 91.15 శాతం పీఎల్‌ఎఫ్ తో సింగరేణి థర్మల్ ప్లాంట్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశంలో దాదాపు 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల పీఎల్‌ఎఫ్ లను దాటి సింగరేణి థర్మల్ ప్లాంట్ ఈ స్థానాన్ని అందుకున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2016 ఆగస్టు లో ప్రారంభమైంది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే సింగరేణి సంస్థ అద్భుతమైన ప్రతిభతో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. కరోనా సమయంలో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వ#హణలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల కన్నా అత్యధిక పీఎల్‌ఎఫ్ సాధిస్తూ ఈ విభాగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థలైన ఎన్టిdపీసీ, అదానీ, టాటా, రిలయన్స్, జిందాల్ తదితర సంస్థల ను కూడా దాటి సింగరేణి నెంబర్ వన్‌గా నిలవడం గమనార్హం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పరిశ్రమలు పలు అభివృద్ధి సూచికల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ఆదర్శవంతంగా ఉంటుంది. తెలంగాణ పరిశ్రమ అయిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా అదే బాటలో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెస్తోంది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన నివేదికలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 7219 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో 91.15 పీఎల్‌ఎఫ్‌తో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన ఎస్టీపీసీ కి చెందిన కోర్భా ప్లాంట్ నిలిచింది. మూడో స్థానంలో ఎస్టీపీసీ కి సింగ్రౌలి( ఉత్తర ప్రదేశ్ ) ప్లాంట్, నాలుగో స్థానంలో వింధ్యాచల్ ప్లాంట్(మధ్య ప్రదేశ్), ఐదో స్థానంలో బక్రేశ్వర్ ప్లాంట్ (పశ్చిమ బెంగాల్), ఆరో స్థానంలో రిహాంద్ ప్లాంట్( ఉత్తర ప్రదేశ్) నిలిచాయి. సీఈఏ ప్రకటించిన 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్‌కు చోటు దక్కలేదు.
రాష్ట్ర ప్రగతికి విద్యుత్.. సింగరేణికి లాభాలు పంచుతూ..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తనవంతు పాత్రను సమర్థంగా నిర్వ#హస్తూ రాష్ట్ర ప్రగతిలో పాలుపంచుకుంటోంది. ఇప్పటి వరకు ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం 52,328 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు అందించి తెలంగాణ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌లో 12 శాతాన్ని సమకూర్చుతోంది. అలాగే సింగరేణి సంస్థకు ఏటా సగటున రూ. 400 కోట్ల పైగా లాభాలను కూడా అందిస్తోంది. నెలావారీ పనితీరును పరిశీలిస్తే రెండో యూనిట్ ఇప్పటికి 10 సార్లు వంద శాతం పీఎల్‌ఎఫ్ దాటి విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా, మొదటి ప్లాంట్ ఎనిమిది సార్లు నూరు శాతం పీఎల్‌ఎఫ్‌ను దాటడం విశేషం. ఇప్పటీ వరకు సింగరేణి థర్మల్ ప్లాంట్ ఇప్పటికి నాలుగుసార్లు వంద శాతం పైబడి పీఎల్‌ఎఫ్ ను సాధించింది. ఈ ప్లాంట్ పీఎల్‌ఎఫ్ లోనే కాకుండా ్లఫయాష్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి అంశాల్లో నూ అద్భుత ప్రతిభ చూపుతూ పలు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నది.
త్వరలోనే మరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు..
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తోడ్పడేందుకు మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోనే ఏర్పాటు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక కూడా సమర్పించి అనుమతి పొందడం జరిగిందని, ఈ నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మార్చి నెల నుంచి నిర్మాణపు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాలపరిమితికి లోపే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. పీఎల్‌ఎఫ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తమ సంస్థ జాతీయ స్థానంలో అగ్రస్థానంలో నిలవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.