Friday, November 22, 2024

Singareni | ఉత్పత్తి, ఉత్పాదకత పెంచకపోతే ప్రమాదంలో సింగరేణి

సింగరేణి కాలరీస్ సుస్థిర భవిష్యత్ కోసం సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉండాలని… లాభాల వాటా పంపిణీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సింగరేణి వ్యాప్తంగా ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర అన్న అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సింగరేణి భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ముఖ్య అతిథిగా మాట్లాడి కంపెనీ ఆర్థిక పరిస్థితులను, పనితీరును వివరించారు. సింగరేణి ఉద్యోగులు తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోకపోతే కంపెనీ మనుగడ చాలా కష్టమని, పని సంస్కృతిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కార్మికులతో పాటు కార్మిక సంఘాలు కూడా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతులను ఉద్యోగులతో పంచుకున్నారు. ఇప్పుటి వరకు సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాలు కేవలం బొగ్గు ఉత్పత్తి వల్లనే అని చాలామంది భావిస్తున్నారని, కానీ వాస్తవానికి బొగ్గు వల్ల వస్తున్న లాభాల కన్నా ఇతరత్రా ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్ల సమకూరుతున్న నిధులతోనే లాభాలు పెరిగాయన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసం గత నాలుగేళ్లలో అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఆర్థిక పరపతి గతంలో AA- గా ఉండేదని, దీనిని చక్కదిద్దడం కోసం చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు సింగరేణి సంస్థ AA+ స్థాయికి చేరింది అన్నారు. గతంలో సింగరేణి సంస్థ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేదని, ఇప్పుడు సింగరేణి సంస్థ ఆర్థిక పరపతి పెరిగినందు వల్ల బ్యాంకులు వారు సింగరేణి సంస్థకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.

గతంలో సింగరేణి సంస్థ ఎక్కువ వడ్డీలకు తెచ్చిన అప్పులను తక్కువ వడ్డీలకు ఇచ్చే బ్యాంకులకు బదలాయించడంతో వడ్డీ భారం తగ్గిందన్నారు. బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. సింగరేణికి బకాయిలు పడిన పలు విద్యుత్ వినియోగదారులకు సింగరేణి పరపతితో తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం జరిగిందని, తద్వారా సింగరేణి సంబంధించిన బకాయిలు దాదాపు 20 వేల కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు.

- Advertisement -

దీనివల్ల తక్కువ వడ్డీకి విద్యుత్ సంస్థలకు రుణాలు లభించడం వల్ల కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గిందన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం చేసిన డిపాజిట్ల వల్ల వచ్చే వడ్డీ ఆదాయం రూ.900 కోట్లకు పైగా ఉంటోందని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా ఏడాదికి సుమారు రూ.500 కోట్ల లాభం సమకూరుతుందని, ఇవన్నీ కలిసి సింగరేణి సంస్థ లాభాల్లో ఉన్నట్లు కనపడుతుందన్నారు.

సింగరేణి వాస్తవ ఆర్థిక పరిస్థితి తెలియక అందరూ సింగరేణి వద్ద కోట్లాది రూపాయల లాభాలు ఉంటున్నాయని భావించి తమ తమ డిమాండ్లను ముందు పెడుతున్నారని, కనీసం సింగరేణి అధికారులు ఉద్యోగులకైనా సరే వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భూగర్భంలో టన్ను బొగ్గు ఉత్పత్తికి 10,000 ఖర్చు అవుతుండగా, బొగ్గు అమ్మకం ధర కేవలం 5000 లోపే ఉందని, టన్నుకు సుమారు 5000 నుండి 6000 రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. భూగర్భ గనుల్లో ఉన్న ఎస్‌డిఎల్, ఎల్‌హెచ్‌డి యంత్రాలను రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే వినియోగిస్తున్నారని, కనుక నష్టాలు భారీగా ఉంటున్నాయన్నారు.

ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీ యంత్రాల వినియోగం 24 గంటల్లో కేవలం 12 గంటలు మాత్రమే ఉంటుందని, ఈ విధంగా మొత్తం మీద చూస్తే బొగ్గు అమ్మకం ద్వారా లభించే లాభాలు దాదాపు 1 శాతం కన్నా తక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రానున్న పోటీ మార్కెట్ లో నిలబడాలంటే సింగరేణి కార్మికులు యంత్రాలను పూర్తి సమయం వినియోగించాల్సిన అవసరం ఉందని, లేదంటే సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్మికులకు అన్ని విషయాలు వివరించమని ఆదేశించిన నేపథ్యంలో ఈ వాస్తవాలు వెల్లడిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకం ధర కోలిండియా ధర కన్నా ఎక్కువ ఉండటం వల్ల చాలామంది విద్యుత్తేతర వినియోగదారులు సింగరేణిని వదిలి కోల్ ఇండియా బొగ్గును కొనడానికి పోతున్నారని, ఇది ఒక ప్రమాద ఘంటిక అన్నారు.

కనుక సింగరేణి ఉద్యోగులంతా డ్యూటీ సమయం 8 గంటలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని, యంత్రాలను పూర్తిగా వినియోగిస్తూ ఉత్పత్తులు పెంచాలని ఉత్పాదకత పెంచాలని కోరారు. కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్తు సింగరేణి కార్మికులపైన, అధికారులుపైన ఉందన్నారు. కార్మికులు కష్టపడటానికి సిద్ధంగా ఉంటారని, వారిని నడిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, చాలామంది అధికారులు టీమ్ వర్క్ గా పనిచేయటం లేదన్నారు.

త్వరలో కంపెనీలో ఉన్న అందరూ అధికారులతో కూడా సమావేశం నిర్వహించి వాస్తవాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాలు అధికారులు కూడా విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు గమనించానని అటువంటివారిని ఉపేక్షించ బోమనిహెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రాతినిధ్య కార్మిక సంఘం తరఫున ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థను లాభాల బాటలో తీసుకెళ్లడం కోసం తమ యూనియన్ అంకితభావంతో పనిచేస్తుందన్నారు. సింగరేణి సంస్థ నష్టాలు ఉన్నప్పుడు లాభాల్లోకి తీసుకురావడానికి కార్మికులంతా కలిసి యాజమాన్యంతో సహకరించారని, ఇప్పుడు కూడా అటువంటి సహకారం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్డి.ఎం.సుభానీ అధ్యక్షత వహించారు. జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం సింగరేణి భవన్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement