- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన సిీఎండీ బలరాం
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ రూ.88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరాం డివిడెండ్ చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు.
సింగరేణి కాలరీస్ చెల్లింపు మూల ధనం (పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్)లో 10 శాతాన్ని డివిడెంట్‌గా చెల్లించాలని ఇటీవల ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మొత్తం సుమారు రూ.173కోట్లు కాగా.. సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో నుంచి 88.55 కోట్ల రూపాయలను డివిడెండ్ చెల్లించింది.
సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలు తీర్చుతూ లాభాలను ఆర్జిస్తూ కార్మికులకు లాభాల వాటా చెల్లించడమే కాకుండా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌లు చెల్లించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.