హైెదరాబాద్, ఆంధ్రప్రభ : రామగుండంలోని ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నులు, వచ్చే ఏడాదికి 80 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సింగరేణి, ఎన్టీపీసీ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఫేస్-1లోని 800 మెగావాట్ల ప్లాంట్‌కు సింగరేణి సంస్థ ఈ ఏడాదికి 4 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనున్నదని మార్కెటింగ్ జీఎం కె. సూర్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఫేజ్-1లోని రెండు ప్లాంట్లకు 80 లక్షల బొగ్గును రవాణా చేయడానికి అంగీకారం తెలిపినట్లు చెప్పారు. రామగుండంలోని 2600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్‌కు ఇప్పటికే ఏడాదికి 112 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ ప్లాంట్‌కు కూడా బొగ్గును అందించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా దాదాపు 8 రాష్ట్రాల్లో ఉన్న 13 ఎన్టీపీసీ ప్లంట్‌కు సింగరేణి సంస్థ ఏటా 139 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తోందని, తద్వారా దేశాభివృద్ధిలో సింగరేణి భాగస్వామి కావడం సంతోషకరమన్నారు. సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ ప్రత్యేక చొరవతో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నామని, రానున్న వేసవిలో సింగరేణితో ఉన్న అన్ని థర్మల్ విదయ్‌త్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి ఈడీ జె.అల్విన్, ఎన్టీపీసీ తెలంగాణ పర్యవేక్షణ ఉన్నతాధికారి పాల్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం తాడబోయిన శ్రీనివాస్, ఎస్‌వోఎం మహేందర్‌రెడ్డి, ఎస్‌ఈ రవి, ఎన్టీపీసీ నుంచి ఆవిష్కర్ మేష్రమ్ తదిరులు పాల్గొన్నారు.