Tuesday, November 19, 2024

సింగపూర్‌ ఓపెన్‌ విజేత పీవీ సింధు, మూడో భారత ప్లేయర్‌గా రికార్డు.. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

తెలుగు తేజం, భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు తన చిరకాల ఆశయాన్ని నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక సింగపూర్‌ ఓపెన్‌ 2022 విజేతగా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ ప్లేయర్‌గా సింధు రికార్డులకెక్కింది. డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు ఈ సీజన్‌లో తొలి సూపర్‌ 500 టైటిల్‌ను దక్కించుకున్నట్లయ్యింది. ఆదివారం నాడిక్కడ జరిగిన టైటిల్‌ పోరులో చైనా క్రీడాకారిణి, వరల్డ్‌ 11వ ర్యాంకర్‌ వాంగ్‌ జీ యీని 21-9, 11-21, 21-15తేడాతో పీవీ సింధు మట్టికరింపించి విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో వాంగ్‌ జీ యీపై పవర్‌ఫుల్‌ స్మాష్‌లతో పూర్తి ఆధిపత్యం చెలాయించి పీవీ సింధు తొలి గేమ్‌ను అలవోకగా గెలిచింది. రెండో గేమ్‌లో సింధుకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వాంగ్‌ జీ యీ ఆధిపత్యం చెలాయించడంతో సింధు షటిల్‌ను సరిగ్గా కంట్రోల్‌ చేయలేక వరుసగా తప్పిదాలు చేసింది.

ఆరంభం నుంచే పైచేయి సాధించిన వాంగ్‌.. 3-0, 6-1, 11-3తో ఆధిక్యాన్ని పెంచుకుంటూ సింధుకు అవకాశం లేకుండా చేసింది. ఇక ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌తో వాంగ్‌ జీ యీ విరుచుకుపడటంతో సింధు చతకిలపడింది. దీంతో 11-21తో రెండో గేమ్‌ కోల్పోయింది. అయితే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించే మూడో గేమ్‌లో సింధు తన తప్పిదాల నుంచి తేరుకుంది. తిరిగి శక్తిని కూడదీసుకున్న సింధు ఆరంభం నుంచే ప్రత్యర్థిని ఏమాత్రం కోలుకోకుండా మెరుపుదాడి చేసింది. ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 4-4 సమంగా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ పాయింట్స్‌ సాధించిన సింధు 8-5తో లీడ్‌లో నిలిచింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన వాంగ్‌ వరుస తప్పిదాలు చేసింది. 12-10తో పుంజుకున్నా, సింధు ఆధిక్యం తగ్గకుండా చెలరేగింది.

చివరకు తనదైన స్మాష్‌లతో 21-15తో పీవీ సింధు విజయం సాధించింది. సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది మూడో టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ఇంటర్నేషనల్‌, స్విస్‌ ఓపెన్‌ 2022 టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు… తాజాగా సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌తో కలిసి మొత్తం మూడు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.

పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను మొట్టమొదటిసారిగా చేజిక్కించుకోగా, ఇంతకు ముందు 2010లో భారత సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌, 2017లో భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాయి ప్రణీత్‌ సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచారు. ఓవరాల్‌గా సింగపూర్‌ ఓపెన్‌ గెలిచిన మూడో భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా పీవీ సింధు గుర్తింపు పొందింది. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు ఈ విజయం సింధుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

”సింగపూర్‌ ఓపెన్‌ 2022 టోర్నీ టైటిల్‌ను మొదటిసారిగా గెలుచుకున్నందుకు పీవీ సింధుకు హృదయపూర్వక అభినందనలు. మీ దృఢత్వం మరియు ఉత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ విజయంతో భారత్‌ కీర్తి మరింత పెరిగింది. ఇలాగే భవిష్యత్‌లోనూ విజయాలు కొనసాగించాలని కోరుతున్నా”

- Advertisement -

-రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

”సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న పీవీ సింధుకు అభినందనలు. అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఇది దేశం గర్వించే క్షణం. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్‌ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది”

-ప్రధాని నరేంద్రమోడీ

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement