వరుస ఓటములతో సతమతం అవుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ ఈవెంట్లో గర్జించింది. తొలి రౌండ్లో స్థానిక షట్లర్ గ్రెగోరియా మారిస్కా తున్జుంగ్ను వరుస సెట్లలో చిత్తుచేసింది. డబుల్ ఒలింపిక్ విజేత, మాజీ వరల్డ్ చాంపియన్ గత రెండు టోర్నీలలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం నాటి గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన సింధు, ప్రత్యర్థిపై అలవోక విజయాన్ని నమోదుచేసింది. 21-19, 21-15 స్కోరుతో కేవలం 38 నిముషాల్లోనే గేమ్‌ను సొంతం చేసుకుంది.
ఈ గెలుపుతో ప్రి-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. తున్జుంగ్పై గత మూడు పోటీల్లో సింధుకు ఇది తొలి విజయం. ఈ ఏడాది మాడ్రిడ్ మాస్టర్స్ ఫైనల్స్, మలేసియా మాస్టర్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియా ప్లేయర్ చేతిలో సింధు పరాజయం పాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి పడిపోయిన సింధు ప్రారంభంలో కఠిన సవాల్‌ను ఎదుర్కొంది. మొదటి సెట్లో 9-7 ఆధిక్యంలో నిలిచిన తున్జుంగ్ను నిలువరించిన తెలుగుతేజం, కొద్దిసేపటికే 10-11 స్కోరుతో వెనక్కినెట్టింది.
తొలిసెట్‌ను కోల్పోయిన ఇండోనేషియా ప్లేయర్ ఒత్తిడితో వరుస పొరపాట్లతో రెండవ సెట్‌పై పట్టుకోల్పోయింది. తదుపరి రౌండ్లో తైవాన్ షట్లర్, మూడవసీడ్ క్రీడాకారిణి తై జు యింగ్ రూపంలో బలమైన ప్రత్యర్థితో సింధు తలపడాల్సి ఉంది. తై జు యింగ్‌కు సింధుపై మెరుగౖౖెన రికార్డు ఉంది. వరుసగా 8 సార్లు నెగ్గింది. మొత్తంగా ముఖాముఖి పోరులో 18-5 ఆధిక్యాన్ని కలిగివుంది.
- ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కూడా గెలుపుతో టోర్నీని ఆరంభించాడు. జపాన్‌కు చెందిన క8ంటా నిషిమోటోపై 21-16, 21-14 స్కోరుతో గెలిచాడు. 50 నిముషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించాడు. గతనెల మలేసియా మాస్టర్స్ సూపర్ 300 టైటిల్‌ను సొంతం చేసుకున్న ఏడవ సీడ్ ఇండియన్ షట్లర్ తదుపరి రౌండ్లో హాంగ్‌కాంగ్‌కు చెందిన ఎన్జి కా లాంగ్ ఆగ్నస్‌ను ఎదుర్కోనున్నాడు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ కూడా ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ద్వయం తోమా జూనియర్, క్రిస్టో పొపొవ్ రెండవ గేమ్ మధ్యలో రిటైర్ కావడంతో భారత డబుల్స్ జోడీ తదుపరి రౌండ్‌కి చేరుకుంది. ప్రత్యర్థి జంట గాయంతో నిష్క్రమించే సమయానికి సాత్విక్-చిరాగ్ జోడీ 21-12, 11-7 స్కోర్‌తో ఆధిక్యంలో ఉన్నారు.
- మహిళల డబుల్స్‌లో భారత జోడీ ట్రీసా-గాయత్రి ప్రారంభరౌండ్లోనే నిష్క్రమించింది. జపాన్‌కు చెందిన రిన్ ఇవనాగ- కై నకానిషి చేతిలో 22-20, 12-21, 16-21 స్కోరుతో ఓటమి పాలయ్యారు.