న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి బయటికొచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరితే ఏమాత్రం ఉపయోగం ఉండదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు. పొంగులేటిని బీజేపీలో చేర్చుకోవడం కోసం కమలదళం నేతలు ప్రయత్నాలు, మంతనాలు సాగిస్తున్నారని.. అయితే తొందరపడి ఆ పార్టీలో చేరితే ఖమ్మంలో బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరించినట్టే అవుతుందని అంటున్నారు. పొంగులేటి బీజేపీలో చేరినట్టయితే జిల్లాలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. అదే కాంగ్రెస్లో చేరితే జిల్లాలో పదికి పది స్థానాలు గెలుపొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
కమ్యూనిస్టులకు, కాంగ్రెస్కు బలమైన ఓటుబ్యాంకు ఉన్న ఖమ్మం జిల్లాలో బీజేపీ చొచ్చుకెళ్లడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో పొంగులేటి బీజేపీలో చేరితే “రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే” అన్న మాటను నిజం చేసినట్టవుతుందని గోనె ప్రకాశరావు అన్నారు. అయితే కాంగ్రెస్లో చేరడానికి రేణుక చౌదరి రూపంలో అడ్డంకులు, అవరోధాలున్నాయని వ్యాఖ్యానించారు. ఆమె ఇప్పటికే పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తుచేశారు. పొంగులేటిని చేర్చుకోకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పొంగులేటి తన వర్గం నేతలతో సహా వచ్చి చేరితే కాంగ్రెస్లో మొదటినుంచి ఉన్నవారు ఏమైపోవాలి అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారని, తెలుగుదేశం నుంచి ఆమె కాంగ్రెస్లో చేరినప్పుడు ఈ విషయం ఎందుకు ఆలోచించలేదని గోనె ప్రశ్నించారు.
గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ ఆమె ఒక సందర్భంలో ప్రకటించారని, అలాంటప్పుడు ఆమె చిరునామాను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మార్చుకుని కనీసం 6 నెలలు ఉండాల్సి ఉంటుందని చెప్పారు. 2009లో కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన విషయాన్ని ఆమె మర్చిపోతున్నారని అన్నారు. పార్శీ-ఉర్దూ చక్కగా మాట్లాడగలిగే రేణుకా చౌదరి ఖమ్మం బదులుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తే బావుంటుందని సూచించారు. హిందూ ఓట్లతో పాటు ముస్లిం ఓట్లు కూడా ఆమెకు పడతాయని జోస్యం చెప్పారు.
ఎన్నికలు సమీపించాక షర్మిల కీలక నిర్ణయం
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురించి కూడా గోనె ప్రకాశరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ పెడతానన్నప్పుడు తొలుత వద్దని వారించానని చెప్పారు. తల్లిదండ్రులు, దైవం తర్వాత తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంత ముఖ్యమని, ఆ చనువుతోనే షర్మిలను పార్టీ పెట్టవద్దని చెప్పానని అన్నారు. కొత్తగా పార్టీ పెట్టి అధికారం సాధించడం అంత సులభం కాదని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని షర్మిల కూడా గ్రహించారని, అందుకే కేసీఆర్ను గద్దె దించడానికి మిగతా పార్టీలన్నీ కలసిరావాలంటూ పిలుపునిస్తున్నారని గోనె చెప్పుకొచ్చారు. ఎన్నికల తేదీలు సమీపించే సమయానికి షర్మిల కీలక నిర్ణయం తీసుకుంటారని గోనె ప్రకాశరావు అన్నారు.
ఏ పార్టీతో కలసి అడుగులేస్తారన్నది తాను ఇప్పుడే చెప్పలేనని, కానీ కచ్చితంగా రాష్ట్రంలో ఒక స్టార్ క్యాంపెయినర్ మాదిరిగా వ్యవహరిస్తారని, ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం కావడం మంచిదని ఆయన సూచించారు. జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడగలిగే సామర్థ్యం ఆమెకు ఉందని అన్నారు. అయితే షర్మిల, విజయమ్మ కారణంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆమె ఫోన్ చేసినా సరే పట్టించుకోవడం లేదని అన్నారు. బహుశా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలతోనే పొంగులేటి ఇలా చేస్తుండవచ్చని, కానీ ఇది కచ్చితంగా షర్మిలకు ద్రోహం చేయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.