పంజాబ్ కాంగ్రెస్ లీడర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇవ్వాల (శుక్రవారం) పాటియాలా కోర్టులో లొంగిపోయారు. పాటియాలాలోని తన నివాసం నుంచి బయల్దేరిన సిద్దూ న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. 38 ఏళ్ల కిందట ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు పెట్టిన కేసులో సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. ఇక తన లొంగుబాటు విషయంపై సిద్దూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ముందు లొంగిపోయేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొంత సమయం కావాలని సిద్దూ తరపు న్యాయవాది సుప్రీంలో వాదనలు వినిపించారు.
ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చిందని, అందుకే తామేమీ నిర్ణయం తీసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సిద్దూ పాటియాలా కోర్టు ఎదుట ఇవ్వాల లొంగిపోయారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది.