Tuesday, November 19, 2024

సిద్దూ నామినేష్‌ దాఖలు, అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ.. శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా శిరోమణి అకాలీదళ్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజీతియాపై సిద్దూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిక్రమ్‌ సింగ్‌ తనకు డ్రైవర్‌తో సమానం అంటూ విమర్శించారు. మజీతియా అస్సలు తనకు పోటీయే కాదంటూ కొట్టి పారేశారు. ఓడిపోతాననే భయంతోనే.. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే.. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. తనకు 17 ఏళ్ల రాజకీయ జీవితం ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి, ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఈ మంచితనమే.. తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజీతా నుంచి కూడా మజీతియానే పోటీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే.. డ్రగ్స్‌ కేసులో బిక్రమ్‌ సింగ్‌ అరెస్టు కూడా అయ్యాడు. ఇక బీజేపీ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఐఏఎస్‌ అధికారి జగ్‌మోహన్‌ సింగ్‌ రాజు బరిలో ఉన్నారు.

భగవంత్‌ మాన్‌ నామినేషన్‌
పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ కూడా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ధూరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో కలిసి ఎస్‌డీఎం ఆఫీస్‌కు చేరుకుని నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మాల్వా ప్రాంతంలోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోనే ధూరి నియోజకవర్గం ఉంది. సంగ్రూర్‌ లోక్‌సభ స్థానానికి భగవంత్‌ మాన్‌ రెండు సార్లు పోటీ చేసి గెలుపొందారు. పంజాబ్లో ఫిబ్రవరి 1తో నామినేషన్‌ల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 20న పోలింగ్‌ జరగనుంది. మార్చి10న ఫలితాలు వెల్లడి అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement