న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ తేదీ నేడు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాల్సిందిగా కోరుతూ సోమవారమే చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, వెంటనే విచారణ జరిపి తగిన తీర్పునివ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎప్పుడు అరెస్టయ్యారు? ఎన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు? అంటూ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ నెల 8న అరెస్టు అయ్యారని లూత్రా తెలిపారు. మంగళవారం మరోసారి కేసును మెన్షన్ చేయాల్సిందిగా చంద్రచూడ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, అవినీతిపై నమోదైన కేసులో తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును తప్పుబడుతూ చంద్రబాబు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో అనేక సాంకేతికాంశాలను ప్రస్తావించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పాత తీర్పులను కూడా ఆ పిటిషన్‌లో ఉదహరించారు.
వాటిలో.. స్టేట్ ఆఫ్ హరియాణా వర్సెస్ భజన్లాల్, యశ్వంత్ సిన్హా వర్సెస్ సీబీఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మల్ చౌదరి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం దర్యాప్తు చేపట్టేముందు చట్టబద్ధమైన అనుమతి తప్పనిసరి. కానీ చంద్రబాబు విషయంలో దర్యాప్తు సంస్థ ఆ నిబంధన అమలు చేయలేదని, తద్వారా ఆయనపై నమోదు చేసిన కేసు, తదుపరి జరుపుతున్న దర్యాప్తు చెల్లుబాటు కావని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పులను తప్పుగా అర్థం చేసుకుని చంద్రబాబుకు ఈ సెక్షన్ నిబంధనలు వర్తించవు అన్న రీతిలో తీర్పునిచ్చిందని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ సెక్షన్ వర్తింపునకు మినహాయింపులు సృష్టించిందని కూడా ఆరోపించారు.
మరోవైపు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 482 ప్రకారం మినీ ట్రయల్ అవసరం లేదని ఒకచోట చెప్పిన హైకోర్టు, మరోవైపు కేసు వివరాలను నమోదు చేయడం ద్వారా మినిట్రయల్ నిర్వహించిందని, ఆధారాలేవీ లేకుండానే పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు ఏకపక్షంగా వ్యాఖ్యానించిందని పిటిషన్‌లో తప్పుబట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు, తదనంతరం సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, పిటిషనర్‌ను రిమాండుకు ఇవ్వడంలో ఉన్న అవకతవకల గురించి హైకోర్టు పట్టించుకోలేదని ఆక్షేపించారు.
2018 జులై 26కు ముందు జరిగిన కేసులకు సెక్షన్ 17(ఏ) వర్తించదని హైకోర్టు తన తీర్పులో పేర్కొ నడం పూర్తిగా తప్పని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విధాన ప్రక్రియకు సంబంధించిన సవరణలు నేరం ఎప్పుడు జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా 2018 జులై 26కి ముందు, తర్వాత తీసుకున్న అన్ని చర్యలూ, అన్ని ఎఫ్ఐఆర్‌లు, విచారణలకూ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటికే చట్టపరంగా నిర్ధారణ అయిందని,, హైకోర్టు ఈ విషయాన్ని విస్మరించిందని అన్నారు.
పిటిషన్లో ప్రస్తావించిన ఇంతర అంశాల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 20 నెలల తర్వాత, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను రాజకీయ కారణాలతో అరెస్టు చేశారని ప్రస్తావించారు. సీఆర్పీసీ కింద ఉన్న నిబంధనలను అనుసరించకుండా, అరెస్టుకు గల కారణాలు చూపకుండా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్‌తో పాటు ఎన్ఎస్జీ కమెండోల భద్రత కల్గిన తనను ఆర్టికల్ 222, సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం సమీపంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, రోడ్డుమార్గంలో 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లారని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా వాస్తవాలకు, చట్టాలకు, కేసు పరిస్థితులకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఉందని, అక్రమ పద్ధతిలో తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఆరోపించారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి దర్యాప్తు తుది దశకు చేరుకుందని తీర్పులో పేర్కొందని, రిమాండ్, కస్టడీ అప్లికేషన్లలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అంశాలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉందని వెల్లడించారు.
చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సీఐడీ ఆయన్ను ప్రశ్నిస్తున్న దృశ్యాలను మీడియా చానళ్లకు విడుదల చేశారని, అలాగే సీఐడీ చీఫ్, న్యాయవాదులు వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విలేకరుల సమావేశాలను నిర్వహించారని పేర్కొన్నారు. చంద్రబాబును రాత్రి వేళ అరెస్టు చేసి 24 గంటల పాటు ప్రశ్నించారని, ఆయన నిద్రపోకుండా అడ్డుకున్నారని తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. 7-8 గంటలు ఆలస్యంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22 ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించారని అన్నారు. సీఐడీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టడమే కాకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.