Thursday, November 7, 2024

చై..నా..లో.. ‘నో లిఫ్ట్’..

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి) : చిన్నపాటి ఇళ్లు కట్టుకున్న అందులో తప్పనిసరిగా లిఫ్ట్‌ ఏర్పాటు చేసుకుంటు న్నారు. ఒకేసారి వచ్చిపోయే వారికి ఇబ్బంది ఉండదు. కానీ చాలాసార్లు ఎక్కి దిగాలంటే లిఫ్ట్‌ తప్పనిసరి. ఐదంతస్థులు ఎక్కి దిగాలంటే మోకాల నొప్పులు కావడం ఖాయం. చైనా కాలేజీల్లో ఐదంతస్థుల ఇరుకైన భవనాల్లో కాలేజీలు ఏర్పాటు చేస్తు న్నారు. పేరుకే లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు తప్పిస్తే వాటిని వినియోగించడం లేదు. అడ్మీషన్ల సమయంలో లిఫ్ట్‌ కిందికి మీదకు తిప్పుతారు. తల్లిదండ్రులు వస్తే వారిని లిఫ్ట్‌ లో పైకి తీసుకెళ్లడం – కిందకు తీసుకరావడం చేస్తారు. ఇది కొన్ని రోజులు మాత్రమే.. రానురాను విద్యార్థులకు చుక్కలు చూపి స్తున్నారు. భోజనాలు ఒకచోట, క్లాస్‌ రూంలు ఓ ఫ్లోర్‌.. హాస్టల్‌ గదులు మరో ఫ్లోర్‌లో ఏర్పాటు చేస్తారు…మొత్తం మీద ఐదంతస్థులు విద్యార్థులు ఎక్కి దిగాల్సిందే. లిఫ్ట్‌ లు వినియోగించడం ద్వారా విద్యుత్తు బిల్లు ఎక్కువగా వస్తుందనే భయంలో వాటిని ఎప్పుడూ మూతేస్తున్నారు. కేవలం అడ్మీషన్ల సమయంలో విద్యార్థులు కాళీ చేసే సమయంలో మాత్రమే లిఫ్ట్‌ లు పని చేస్తున్నాయి.

మిగతా సమయంలో నో లిఫ్ట్‌ .. కాలేజీలు కావవి బంధీఖానాలు..
ఒక క్యాంపస్‌లో ఐదువందలకు పైగానే విద్యార్థులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక తరగతి గదిలో వందమందికి తగ్గకుండా ఏర్పాటు చేస్తున్నారు…ఇలాంటి సమయంలో చదువులు ఎలా బుర్రకెక్కుతాయో వారికే తెలియాలి. తక్కువమంది ఉంటే చదువు బుర్రకు ఎక్కకపోతే సార్‌ను అడిగి తన అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీచైతన్య- నారాయణ కాలేజీల్లో తిరిగి చెప్పడం అనేదే ఉండటం లేదు. యంత్రంలాగా లెక్చరర్లు పాఠం చెప్పుకుంటుపోతూనే ఉంటారు. అర్థం కాలేదని ఎవరైనా విద్యార్థి అంటే మాత్రం వారి సెక్షన్‌ మార్చేస్తారు. విద్యార్థుల చదువును బట్టి సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. బాగా చదివే విద్యార్థులకు ఒక రకంగా.. డల్‌గా ఉంటే విద్యార్థులను మరో రకంగా బోధన ఉంటుంది. విద్యార్థులను బంధీఖానాలో పెట్టి ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఒకే గదిలో ఎక్కువమంది ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. కాస్త ఆలస్యంగా క్లాస్‌కు వెళ్తే మాత్రం చివర్లో కూర్చోవల్సిందే. వెనకాల ఉన్న విద్యార్థులకు పాఠం సరిగా వినిపించే పరిస్థితులు లేవు. తరగతి గదులను కూడా తల్లిదండ్రులు పరిశీలించే అవకాశం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యా బోధన జరిగితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బందీఖానాలో పెట్టి చదివిస్తే చదువులు ఎలా బుర్రకు ఎక్కుతాయనే దానిపై కార్పొరేట్‌ యాజమాన్యాలు దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఎక్కువమంది ఉండటంతో చదువు కూడా సక్రమంగా అర్థం కాక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మానసిక వత్తిడీలకు గురవుతున్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితులను అర్థం చేసుకునే పరిస్థితులు ఎంతమాత్రం లేవు. యంత్రం లాగా చదువు చెప్పడం. యంత్రం లాగా విద్యార్థులు వినడం వరకే పరిమితం. విద్యార్థుల మానసిక పరిస్థితులపై యాజమాన్యాలు దృష్టిని కేంద్రీకరించడం లేదు. దాని పర్యవసానమే విద్యార్థుల ఆత్మహత్యలు.

చై..నా ఇష్టారాజ్యం..
శ్రీచైతన్య- నారాయణ కార్పొరేట్‌ కాలేజీల పేరు చెబితేనే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కార్పొరేట్‌ సంస్థల విద్యా వ్యాపారంపై వేలాది ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే నాధుడే కనిపించడంలేదు. ఆ రెండు కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. అందులో వాళ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు…ఎవరేమి అనుకుంటే మాకేమిలే -మాకు డబ్బులు వస్తున్నాయి అంతేచాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కార్పొరేట్‌ సంస్థల విద్యా వ్యాపారం ప్రారంభమై ఎన్నో సంవత్సరాలు అవుతోంది. వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఐనా కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు కాలేదు. అందులో పని చేసే వార్డర్లు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, లెక్చరర్ల పైనే నామ మాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అసలు వారిని వదిలిపెట్టి అందులో పని చేసే వారిపై చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధం. కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement