న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణపై ఇకనైనా చిత్తశుద్ధి చాటుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన మంద కృష్ణ, కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004 డిసెంబర్‌లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని, అప్పటి నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ ‘వర్గీకరణ’ అంశం పెండింగులోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రతిసారీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చుతోంది తప్ప ఆచరణలో మాత్రం చిత్తశుద్ధిని చాటుకోవడం లేదని విమర్శించారు. ఇప్పుడు తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చారని, ఆయనకు 40 ఏళ్లుగా పెండింగులో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశంతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన పెండింగ్ అంశాలు, చట్టంలో లేని అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారని మంద కృష్ణ గుర్తుచేశారు.
కానీ 2 దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మాదిగల సమస్య ఎస్సీ వర్గీకరణ గురించి మాత్రం నేతలిద్దరిలో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాదిగల సమస్యపై వారి చిత్తశుద్ధి ఇక్కడే బహిర్గతమవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాన మంత్రి దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే 24 గంటల్లో సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారని, ప్రధానిని కలిసినప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాత్రం మరిచారని విమర్శించారు.
మాదిగల పట్ల కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే.. మాదిగలు ఈ పార్టీకి రోజురోజుకూ దూరమవడం ఖాయమని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి, అఖిలపక్షంతో కేంద్రం వద్దకు రావడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 11న మాదిగల విశ్వరూప సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ కూడా వర్గీకరణకు అనుకూలం అంటూ ప్రకటించారని, కేంద్రం సానుకూలంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకుంటే సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందని మంద కృష్ణ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ జరిగేవరకు ఎస్సీ కోటా ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ రిజర్వేషన్‌ను 18%కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, రిజర్వేషన్లు పెంచడం ప్రభుత్వం చేతుల్లోనే ఉందని తెలిపారు. ఆర్థికభారంతో సంబంధం లేని అంశం కాబట్టి వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచి, ఆ తర్వాతనే నియామకాలు చేపట్టాలని కోరారు. దీంతో పాటు చేయూతనిచ్చే పెన్షన్లను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో అనాథ పిల్లలను ఆదుకునే ప్రయత్నం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.