Friday, January 10, 2025

TG | ప్రజలకు అందుబాటులో ఉండాలి.. కలెక్టర్ల భేటీలో సీఎం రేవంత్ !

  • అలసత్వంతో ఉన్న కలెక్టర్లపై వేటు తప్పదు
  • ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లదే
  • ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్
  • నెలకోసారి ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించాలి

కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం చేసే అజెండాతో సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, వారి పనితీరు ప్రభుత్వ పనితీరుకు కొలమానమని అన్నారు.

జనవరి 26న ప్రభుత్వం పేదల కోసం కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతోందని ప్రకటించారు. ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నాలుగు పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సక్రమంగా పర్యవేక్షించ లేదని… అలసత్వంతో ఉన్న కలెక్టర్లపై వేటు తప్పదని హెచ్చరించారు. క‌లెక్ట‌ర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుల వరకు చేరాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు.

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో వరుసగా ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనలపై సీఎం సీరియస్‌ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలకోసారి ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి రాత్రి బస చేయాలని సీఎం సూచించారు. మహిళా అధికారులు బాలికల హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. జనవరి 26 తర్వాత తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు.

ఈ భేటీకి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement