Sunday, November 17, 2024

వానాకాలం పంటలకు విత్తనాల కొరత.. తొలకరి రాకతో సాగు పనుల్లో రైతులు..

ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్ : జిల్లాలో అత్యధికంగా సాగు చేసే కంది పంటలకు విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడింది. కందితో పాటు వరి పంటను ఖరీఫ్‌ సీజన్‌లో అధికంగా రైతులు సాగు చేస్తారు. వరి విత్తనాల కొరకు రైతులు పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఖరీఫ్‌లో వివిధ పంటలను సాగు చేసే రైతులకు విత్తనాలు ఎక్కడ లభిస్తాయి అనే కనీస సమాచారం కూడా వ్యవసాయ శాఖ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఖరీఫ్‌ సాగు ప్రణాళికలను విడుదల చేస్తోంది. ఈసారి కూడా సాగు ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని నెలలను దృష్టిలో ఉంచుకొని పత్తి, కంది పంటలను అధికంగా సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలోని రేగడి పొలాలు, చెలక నేలల్లో కంది పంటను..పత్తి పంటను సాగు చేయాలని రైతులకు సూచించింది. ఇక బోర్ల కింద వరి పంటను సాగు చేయాలని పేర్కొంది. గత కొద్ది ఏళ్లుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న సాగు ప్రణాళికలను రైతులు పాటిస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రతిఏటా పత్తి.. కంది పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో బోర్లు..ప్రాజెక్టుల కింద వరి పంట సాగు సైతం పెరుగుతోంది.

ప్రభుత్వం ఖరారు చేసిన సాగు ప్రణాళిక ప్రకారం జిల్లాలో పత్తి పంటను 2.50 లక్షల ఎకరాలలో.. కంది పంటను 2.25 లక్షల ఎకరాలలో సాగు చేయాలని సూచించింది. ప్రభుత్వం ఖరారు చేసిన సాగు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. విత్తనాల విషయంలో మాత్రం వ్యవసాయ శాఖ ప్రతిఏటా చేతులెత్తేస్తోంది. పత్తి విత్తనాలు మాత్రం మార్కెట్‌లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న కంది.. వరి విత్తనాలు మాత్రం ఎక్కడా లభించడం లేదు. తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కొంత మేరకు కంది విత్తనాలను విక్రయిస్తున్నారు. తాండూరు ప్రాంతంలోని రైతులు కంది విత్తనాలను పరిశోధన కేంద్రంలో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కంది విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొంది. చాలా మంది రైతులు క్రితం సారి పండించిన కంది పంట నుంచి కొంత మొత్తంను విత్తనం కొరకు దాచి వినియోగిస్తున్నారు. కందితో పాటు పెసర, మినుములను కూడా ఇలాగే ఇంటి పంట ద్వారా మరుసటి ఏడాది వినియోగిస్తున్నారు. నాణ్యమైన కంది, పెరస, మినుము విత్తనాలు మాత్రం మార్కెట్‌లో లభించడం లేదు. ఇక జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు లక్ష ఎకరాలలో సాగు అయ్యే వరి పంటకు సంబంధించిన విత్తనాలు ఎక్కడా దొరకడం లేదు.

ప్రైవేటులో కూడా వరి విత్తనాలు లభించని పరిస్థితి నెలకొంది. మంచి రకాలకు సంబంధించిన విత్తనాల కొరకు రైతులు ఇతర జిల్లాలకు వెళుతున్నారు. కొందరు రైతులు వరంగల్‌. సూర్యాపేట్‌ ప్రాంతాల నుంచి వరి విత్తనాలను తెప్పించుకుంటున్నారు. గతంలో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డిసిఎంఎస్‌) నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు విక్రయించింది. గత కొద్ది ఏళ్లుగా డిసిఎంఎస్‌ కూడా విత్తన విక్రయాలకు దూరంగా ఉంటోంది. జిల్లాలో రైతులకు అవసరం అయిన కంది..వరి..పెరస, మినుము తదితర విత్తనాలు ఎక్కడ లభిస్తున్నాయి అనే కనీస సమాచారం కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఇవ్వకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement