హెదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత వెంటాడుతోంది. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు ఉండడం లేదు. సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్‌పై ఉన్న ఆసక్తి ప్రొఫెసర్లను నియమించుకోవడంలో కొన్ని కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నాన్ అటానమస్ కాలేజీలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు, అటానమస్ కాలేజీలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక సహాయ ఆచార్యుడు (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉండాలి. కానీ ఈ విధమైన నియమ నిబంధనలను చాలా కాలేజీలు పాటించడంలేదు. బ్రాంచీలకు అనుగుణంగా ప్రొఫెసర్లు దొరకపోవడంతో ఇతర బ్రాంచీల వారితోనే కొత్త కోర్సుల బోధన కోసం వినియోగించుకుంటున్నారు. వారితోనే తరగతులు చెప్పిస్తున్నారు. సహాయ ఆచార్యుడిగా నియమించాలంటే బీటెక్, ఎంటెక్ చేయడంతో పాటు ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు విద్యార్థుల్లో చాలా క్రేజ్ ఉంది. దీనికి అనుబంధ కోర్సులైన (ఎమర్జింగ్ కోర్సులు) సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా సైన్స్, ఐవోటీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఈసారి చాలా కాలేజీలు మార్చుకున్నాయి. అయితే సీట్లు, కోర్సులు మార్చుకున్న కాలేజీలు మాత్రం ప్రొఫెసర్లను నియమించుకోవడంపై ఏమాత్రం దృష్టా సారించడంలేదు. ఉన్న వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సారి దాదాపు 6500 ఎమర్జింగ్ కోర్సులకు సీట్లు పెరిగాయి. నాన్ సర్క్యూట్ బ్రాంచి అధ్యాపకులను కొత్త కోర్సుల కోసం ట్రైనింగ్ ఇప్పించి వారితోనే విద్యార్థులకు తరగతులు చెప్పిస్తున్నారని తెలిసింది.
రాష్ట్రంలో మొత్తం 173 కాలేజీలు ఉంటే అందులో దాదాపు 145 వరకు ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. 2.80 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 14వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుంటే మిగిలి విద్యార్థులంతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే చదువుతున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా దాదాపు 45 వేల మంది వరకు అధ్యాపకుల అవసరం ఉన్నట్లుగా ఓ అంచనా. కానీ ప్రస్తుతం పనిచేస్తుంది మాత్రం సుమారు 22 వేల మందే అని సమాచారం. కాగితంలో చూపించే లెక్కలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. ఇటీవల ఏఐసీటీఈకి 45 వేల మంది మొత్తం అధ్యాపకులు ఉన్నట్లు కాగితాలపై చూపించినట్లు టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ముగ్గురు అవసరం ఉన్న దగ్గర ఒకరే పనిచేస్తున్నారని తెలిపారు. సీట్లు, కోర్సుల కన్వనర్షన్, పెంపుకు అనుమతులిచ్చే అధికారులు కాలేజీల్లో సరిపడ, నిర్ధేశిత అర్హత కలిగిన ప్రొఫెసర్లు ఉన్నారా? లేదా? అనే దానిపై ఆరా తీయడంలేదు. దాంతో లక్షల ఫీజులు కట్టే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతుందనే విమర్శ ఉంది.
లేని వాళ్లను ఉన్నట్లుగా చూపిస్తున్న వైనం…
కొన్ని కాలేజీలు కళాశాలలో పనిచేయని అధ్యాపకులను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగితాల్లోని లెక్కల్లో అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా ఉంటారు గానీ, తరగతి గది బోధనలో మాత్రం వారు కనిపించరు. వీరంతా రోజూ ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ మాత్రం వేసి వెళ్తుంటారు. అందుకు వీరికి నెలకు దాదాపు రూ.15వేల వరకు డబ్బులు ఇచ్చేందుకు కొన్ని కాలేజీలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 70 శాతంపైగా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరని తెలుస్తోంది. దాదాపు 20 శాతం వరకు కాలేజీలు ఉత్తుత్తి అధ్యాపకులను నియమించుకొని వారితో బయోమెట్రిక్ హాజరు వేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరు ఉదయం 9.30 గంటలలోపు ఓసారి, మళ్లిd సాయంత్రం 4 గంటల తర్వాత డ్యూటీ అయిపోయినట్లుగా తంబ్ వేసి వెళ్తున్నారు. వీరిలో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నట్లు టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్ కుమార్ తెలిపారు. అయితే ఇలాంటి కాలేజీలకు చెక్‌పెట్టేందుకు గానూ ఇటీవల ప్రభుత్వం అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జేఎన్టీయూహెచ్ వర్సిటీ తన పరిధిలోని కాలేజీలకు బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేసింది.