Tuesday, November 19, 2024

గిరిజ‌న ప్రాంతాల్లో వైద్యుల కొర‌త‌.. రోగాల‌తో తల్లడిల్లుతున్న గ్రామీణులు..

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజారోగ్యం పడకేసింది. సకాలంలో వైద్యం పొందేందుకు అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 50 శాతం ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించేందుకు ఎంబీబీఎస్‌ వైద్యులు సుముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం 600 మంది ఎంబీబీఎస్‌ వైద్యుల అవసరం ఉంది. అయితే ఇందులో 50శాతం అంటే 350 దాకా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉన్న 250 మందిలో 20శాతం మంది మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు… మిగతా వారంతా కాంట్రాక్టు వైద్యులే.

దీంతో చిన్న విషజ్వరం వచ్చినా సర్కారీ వైద్యం సకాలంలో అందక ఆదివాసీ, గిరిజనులు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తితోపాటు కొద్దిరోజుల కిందటదాకా కురిసిన భారీ వర్షాల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంబీబీఎస్‌ వైద్యులు సరిపడినంత మంది అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందక రోగాలు, విషజ్వరాలు ముదిరి అడవి బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారు. మరోవైపు వికారాబాద్‌, నారాయణపేట, వనపర్తి, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, కామారెడ్డి, పెద్దపల్లి తదితర గ్రామీణ జిల్లాల్లోనూ ఎంబీబీఎస్‌ డాక్టర్ల కొరత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement