Friday, November 22, 2024

ప్రభుత్వ హాస్పిట‌ళ్ల‌లో వైద్యుల కొరత.. రోగులకు సేవలు అందడంలో ఇబ్బందులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిత్యం రద్దీగా ఉండే రాజధానిలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులను డాక్టర్ల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో వచ్చే ఔట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ రోగులకు వైద్య సేవలు అందించలేక ఉన్న అరకొర వైద్యులు సతమతమవుతున్నారు. ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందని డ్యూటీ డాక్టర్లు వాపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. కొత్త డాక్టర్ల నియామకాలను వీలైనంత త్వరగా చేపడితేనే రోగులకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందే వీలుంటుందని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులు తెగేసి చెబుతున్నారు. వైద్యుల కొరత కార్డియాలజీ, నెఫ్రాలజీ, అనస్థిషియా, ఆర్థోపెడిక్‌ తదితర కీలక విభాగాల్లో తీవ్రంగా ఉంది. దీంతో కీలకమైన ఈ వైద్య సేవలు అందించడం అరకొరగా ఉన్న వైద్యులకు తలకుమించిన భారంగా మారింది.

హైదరాబాద్‌లో పేద ప్రజానికానికి వైద్యం అందించే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న కొద్ది మంది డాక్టర్లపై తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాకుండా ఉన్న వైద్యులే ఎక్కువ సమయం కేటాయించి చికిత్స అందించాల్సి వస్తోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే రోజులో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోందని జూనియర్‌ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి 48గంటలు పనిచేయాల్సిన చోట కాని జూనియర్‌ డాక్టర్లతో వారానికి 90 నుంచి 110 గంటల వరకు పనిచేయిస్తున్నారు. సాధారణంగా వైద్యులకు నైట్‌ డ్యూటీ అంటే రాత్రి విధులు నిర్వర్తిస్తే సరిపోతుంది. కాని జూనియర్‌ డాక్టర్ల విషయానికి వచ్చే సరికి ఆ రోజున పగలు విధులతోపాటు నైట్‌ డ్యూటీని అధనంగా చేయాల్సి వస్తోంది. ఉదయం 9 గంటలకు డ్యూటీలో చేరితే మరుసటి రోజు సాయంత్రం 4గంటలకు ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఈ సమస్యకు తెలంగాణలో రోగుల సంఖ్యకు మేర డాక్టర్లను నియమిస్తేనే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. డీఎస్‌, డీఎంవో, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వైద్యుల నియామకాలను వెంటనే భర్తీ చేయాలని జూనియర్‌ డాక్టర్లు కోరుతున్నారు. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే పై స్థాయిలో ఉన్న రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులలు, జూనియర్‌ డాక్టర్లపై పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement