హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆగస్టు ఒకటి నుంచి తెలుగు సినిమాల షూటింగ్లు నిలిచిపోతున్నాయి. ఈ మేరకు గిల్డ్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సమావేశమైన గిల్డ్ (యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూర్స్ గిల్డ్) సభ్యులు ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లు నిలుపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినిమా నిర్మాతల మండలితో సంబంధం లేకుండా గిల్డ్ ప్రత్యేకంగా ఏర్పాటైంది. ఇందులో రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలే సభ్యులు. నిర్మాణంలో ఉన్న దాదాపు 90 శాతం సినిమాలు వీరు నిర్మిస్తున్నవే కావడంతో వీరు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో సమావేశమైన గిల్డ్ పనులు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించారు. వీటిలో ప్రధానంగా పెరుగుతున్న చిత్ర నిర్మాణ వ్యయం, ఓటీటీలో విడుదలపై స్పష్టత గురించి చర్చించినట్టు తెలిసింది.
సినిమా చిత్రీకరణ నిలిపివేసి సమస్యలపై చర్చించుకోవాలని భావిస్తూ ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు అందరూ గిల్డ్ నిర్ణయాన్ని సమర్థించారు. మరోవైపు తెలుగు నిర్మాతల మండలి ఇప్పటికే పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభాన్ని పరష్కరించే దిశలో మార్గంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారీ చిత్రాలను పది వారాల తర్వాత చిన్న సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సినిమా థియేటర్ టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు వచ్చాయి. బుధవారం నిర్మాతల మండలి సమావేశమై ఈ సమస్యలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.