ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బుధవారంనాడు పుతిన్ సేనలకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. నల్ల సముద్రంలోని స్నేక్ఐలాండ్లో మోహరించిన రష్యా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలను పేల్చివేసిన కీవ్ సేనలు, మరోవైపు రష్యా భూభాగంలోని అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారాన్ని పేల్చేశాయి. ఈ రెండు సంఘటనలలో రష్యా తీవ్రంగా నష్టపోయినట్లు బ్రిటన్ నిఘాసంస్థలు ధ్రువీకరించాయి. కొద్దివారాలుగా పట్టు సాధించిన డోనెట్స్లో రష్యా అనుకూల వేర్పాటువాద బలగాల్లో సగానికి సగం మంది ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్ వెల్లడించింది. మరోవైపు బుధవారంనాటి యుద్ధంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
నల్లముద్రంలో వ్యూహాత్మకంగా ఉండే స్నేక్ ఐలాండ్‌ను రష్యా దండయాత్ర ప్రారంభించిన మొదటి రెండురోజుల్లోనే స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ అక్కడ రష్యాను దెబ్బతీస్తూనే ఉంది. అక్కడికి సమీపంలోనే రెండు నౌకలపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయినప్పటికీ రష్యా ఆ చిన్నపాటి ద్వీపంలో సైనిక మోహరింపులు మానలేదు. దాదాపు వంద ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరంలోని ఔట్‌పోస్టులో పంట్సర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, రాడార్ స్టేషన్, బలగాలను కీవ్ బలగాలు పేల్చివేశాయి. వివిధ రకాల ఆయుధాలతో రష్యా ఔట్‌పోస్ట్‌ను పేల్చేశామని ఉక్రెయిన్ దక్షిణ ప్రాంత కమాండ్ ప్రకటించింది.
ఉక్రెయిన్ దాడికి సంబంధించిన తీవ్రత ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో రికా ర్డయ్యింది. సైనిక స్థావరం ధ్వంసమవడం, టవర్ అగ్నికీలల్లో మండిపోవడం కన్పించింది. మరోవైపు డోనెట్స్క్లోనూ రష్యాకు దెబ్బ తగిలింది. రష్యా దండయాత్ర ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న వేర్పాటువాద వర్గాలు కూడా భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయి. ఆ బలగాల్లో 55 శాతం మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్ బుధవారం వెల్లడించింది. కాలంచెల్లిన ఆయుధాలు, సాంకేతిక పరికరాల వైఫల్యంతో రష్యా దెబ్బతింటోంది. ప్రస్తుతం రష్యా దృష్టి అంతా ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై ఉండటంతో అక్కడికి పెద్దఎత్తున బలగాలను తరలించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ స్నేక్ ఐలాండ్, డోనెట్స్క్లలో రష్యాను వ్యూహాత్మకంగా దెబ్బతీసింది.
ఉక్రెయిన్ సరిహద్దులకు 80 కి.మి. దూరంలో స్నేక్ ఐలాండ్ ఉంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్యలో ఉన్న ఈ ప్రాంతం చాలా చిన్నదే అయినప్పటికీ వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. రష్యా దండయాత్ర ప్రారంభం కాకముందు ఉక్రెయిన్ చేతుల్లో ఉండేది. ఆ తరువాత రష్యా స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ రష్యాకు తరచూ గట్టి దెబ్బలు తగులుతున్నాయి. నల్లసముద్రంలో రష్యా బలగాలకు ఉక్రెయిన్ సవాళ్లు విసురుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం నెప్ట్యూన్ మిసైళ్లతో మాస్కోవా యుద్ధనౌకను, హర్పూన్ మిసైళ్లతో సైనికులను, ఆయుధాలను తరలిస్తున్న టగ్బోట్ను పేల్చివేసింది. ఆయా సంఘటనల్లో భారీ ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇప్పుడు ఏకంగా సైనిక స్థావరాన్నే ధ్వంసం చేసింది. అటు మిసైళ్ల దాడిని, ఇటు డ్రోన్ దాడిని రష్యాకు చెందిన రాడార్, ఇతర వ్యవస్థలు నిరోధించలేకపోవడం విశేషం.
రష్యా ఆయిల్ రిఫైనరీ పేల్చివేత..
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా భూభాగంలోని రొస్తోవ్ రీజియన్లోనినోవోషఖిటిన్స్క్ లోని ఓ నూనె శుద్ధి కర్మాగారాన్ని ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ల సహాయంతో పేల్చివేసింది. మానవ రహిత కమికజే డ్రోన్లతో సహాయంతో ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడింది. తక్కువ ఎత్తునుంచి ఎగురుతూ వచ్చిన డ్రోన్లను రష్యా సైనికులు గుర్తించినప్పటికీ అప్రమత్తం కాలేదు. కొద్దిసేపటి తరువాత అది ఉక్రెయిన్ వైపు నుంచి వచ్చినట్లు గుర్తించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సైనికుల మీదుగా రెండుమూడు సార్లు ఎగురుతూ వెళ్లిన డ్రోన్ ఆ తరువాత కర్మాగారంపై దాడి చేసింది.
వెంటనే అగ్నిగోళంలా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసి పడ్డాయి. ఫ్యాక్టరీ దట్టమైన పొగలతో నిండిపోయింది. ఆ తరువాత పెద్ద పేలుళ్లు సంభవించాయి. పేలుడు శబ్దం దాదాపు పది కి.మి. దూరం వరకు విన్పించిందండే ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అర్ధమవుతుంది. అక్కడున్న కార్మికుల్లో కొందరు డ్రోన్ ఎగరడాన్ని, దాడి చేయడాన్ని వీడియోలో రికార్డు చేయగా మిగతావారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన ఈ రిఫైనరీ దక్షిణ రష్యాలోనే అతిపెద్దది. కాగా ఈ దాడిని రష్యా ధ్రువీకరించింది.
తూర్పు ప్రాంతంలో రష్యా దాడులు..
ఇదిలా ఉండగా తూర్పు ఉక్రెయిన్‌లోని లుషాంక్ ప్రాంతంలో రష్యా బలగాలు ముందడుగు వేస్తున్నాయి. సీవీరోడోనెట్‌స్కీ, లిసిచాన్స్క్ పట్టణాలతో పాటు అనేక పల్లెలలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. మైకోలివెయ్ పట్టణంపై ఏడు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. అలాగే నౌకాపట్టణం ఒడెశాపైనా క్షిపణులు ప్రయోగించింది. మరోవైపు ఖార్కీవ్‌పైనా దాడులు ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా రష్యాలో ఉక్రెయిన్‌కు చెందిన సైనికుడు, జర్నలిస్ట్‌ను అతి క్రూరంగా హత్య చేసినట్లు వెల్లడైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.