Tuesday, November 26, 2024

సీఎం యోగికి షాక్-ద‌ళితుడ‌ని అవ‌మానించినందుకే రాజీనామా చేస్తున్నా-మంత్రి దినేష్ ఖ‌టిక్

తాను ద‌ళితుడుని అయినందుకే త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని ఫిర్యాదు చేస్తూ యూపీ మంత్రి దినేష్ ఖ‌టిక్ రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పంపారు.దాంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి ఖటిక్ తన లేఖలో తనకు 100 రోజుల ప‌ద‌వీకాలంలో.. త‌న‌కు ఎలాంటి పని అప్పగించలేదన్నారు. శాఖాపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. త‌న‌ని ద‌ళితుడని అవ‌మానించిందుకే రాజీనామా చేస్తున్నానని సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు.

తాను దళితుడు కావడం వల్లే త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదనీ, త‌న మాట ఎవ‌రూ వినడం లేదని మంత్రి ఆరోపించారు. తాను రాష్ట్రమంత్రిగా పని చేయడం దళిత వర్గానికి వ్యర్థమ‌నీ, ఏ సమావేశం గురించి కూడా తన‌కు సమాచారం ఇవ్వ‌డం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు మంత్రిగా ఓ అధికారిక వాహనం మాత్రమే ఇచ్చారని, ఇది దళిత సమాజాన్ని అవమానించడమేన‌ని హోంమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రి బదిలీ కేసుల్లో కూడా పెద్ద అవినీతి ఆరోపణలు చేశారు. అధికారులను అడిగితే.. ఇంకా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. నమామి గంగే పథకంలో కూడా అవినీతి జరిగిందని మంత్రి అన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన వారిని గౌరవంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వంలోని అధికారులు దళితులను అవమానిస్తున్నారనీ, అటువంటి పరిస్థితిలో.. రాష్ట్ర మంత్రిగా పదవికి రాజీనామా చేస్తున్నానని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మ‌రో మంత్రి జితిన్ ప్రసాద కూడా రాజ‌నామా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తన టీమ్‌లోని ఓ అధికారిని ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు.ప్రసాదకు కీలక మంత్రిత్వ శాఖ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) – అయితే ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించిందని, పలువురు అధికారులు బదిలీల కోసం లంచం తీసుకున్నట్లు తేలింది. డిపార్ట్‌మెంటల్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement