ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సొంతం చేసుకోగా పంజాబ్‌లో ఆప్‌కు, యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. యూపీలోని రెండు కీలక లోక్‌సభ నియోజకవర్గాలలో బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటల్లాంటి రాంపూర్, అజంగఢ్‌లలో కమలదళం తిరుగులేని విజయాలు నమోదు చేసింది. ఇక త్రిపురలో నాలుగు అసెంబ్లి స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో మూడుచోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ గెలుపొందాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బోర్డోవాలీ శాసనసభ స్థానం నుంచి గెలుపొందారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆయన తప్పనిసరిగా గెలవాల్సి ఉండగా ఓటర్లు ఆయనకు పట్టంకట్టారు. ఢిల్లి, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో 3 లోక్‌సభ, 7 శాసనసభ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు నిర్వహించగా ఆదివారం ఓట్ల లెక్కించారు. తుది మెజారిటీ అధికారికంగా ప్రకటించవలసి ఉన్నప్పటికీ ఆధిక్యతను బట్టి ఆయా పార్టీల గెలిచినట్టు భావిస్తున్నారు.
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న భగవంత్ మాన్, తను ప్రాతినిధ్య వహించిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన గుర్మెయిల్ సింగ్‌పై శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్)కు చెందిన సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ దాదాపు 5,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 1999లో ఇదే స్థానంనుంచి నెగ్గిన సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ ఆ తరువాతి ఎన్నికల్లో పరాజయంపాలైనారు. 77 ఏళ్ల సిమ్రాన్ పోటీచేసిన శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్)కు, ఎస్‌డీ (శిరోమణి అకాలీదళ్)కు ఎటువంటి సంబంధం లేదు. 2014, 2019 ఎన్నికల్లో సంగ్రూర్‌నుంచి భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అధికారం చేపట్టారు. తిరుగులేని మెజారీటీతో నెగ్గిన ఆప్‌కు కొద్దినెలల్లోనే ఎదురుదెబ్బ తగలడం విశేషం. ఇటీవల హత్యకు గురైన గాయకుడు మూసేవాలా వర్గం సిమ్రాన్‌జిత్ సింగ్‌కు గతంలో మద్దతు ప్రకటించింది. కాగా ఉపఎన్నికల్లో పోలింగ్ అతి తక్కువగా (45.3 శాతం) నమోదైంది. 2019లో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం 72.44 శాతం. సంగ్రూర్‌నుంచి 16మంది అభ్యర్థులు బరిలో నిలవగా బీజేపీ అభ్యర్థి కెవాల్ థిల్లాన్, అకాలీదళ్ అభ్యర్థి కమల్‌దీప్ కౌర్ రజోనా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 2022 అసెంబ్లిd ఎన్నికల్లో సంగ్రూర్ లోక్‌సభా స్థానం పరిధిలోని లెహ్రా, దిర్బా, బర్నాలా, సునమ్, బహదూర్, మెహల్ కలాన్, మలేర్‌కోట్ల, దురి, సంగ్రూల్ అసెంబ్లి సెగ్మెంట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కాగా సంగ్రూర్‌లో ఓటమితో ఆప్‌కు లోక్‌సభలో ప్రాతనిధ్యం లేకుండా పోయినట్టయింది.
ఢిల్లిలో గెలుపు…
పంజాబ్‌లో పరువుపోయినప్పటికీ ఢిల్లిలో మాత్రం ఆప్ తన పట్టును మరోసారి నిరూపించుకుంది. ఢిల్లి లోని రాజేంద్రనగర్ అసెంబ్లి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్, సమీప బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్య వహించిన రాఘవ్ ఛద్దా రాజ్యసభకు ఎన్నికవడంతో రాజీనామా చేశారు. అందువల్ల ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. కాగా తమ పార్టీ అభ్యర్థి విజయంపై ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు చూపిన ఆదరాభిమానాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు.
యూపీలో బీజేపీ సత్తా..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటల్లో కమలం జెండా పాతింది. ఆ పార్టీలో కీలక నేత, అఖిలేష్‌కు అత్యంత సన్నిహితుడు అజంఖాన్ ప్రాతినిధ్యం వహించిన రామ్‌పూర్‌లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ లోఢి, అజంఖాన్ మిత్రుడు, ఆ పార్టీ అభ్యర్థి అసిమ్ రాజాపై దాదాపు 40 వేల ఓట్ల తేడాతో ఎస్‌పీ అభ్యర్థిపై విజయం సాధించారు. గత శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్న అజంఖాన్ రామ్‌పూర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఎస్‌పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన అజంగఢ్‌లోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. సాక్షాత్తు అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో కమలం విజయం దిశగా దూసుకుపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ఘన విజయం సాధించారు.
త్రిపురలో బీజేపీ హ్యాట్రిక్..
త్రిపురలో నాలుగు శాసనసభ స్థానాలకు నిర్వహించిన ఉపఎన్నికల్లో అధికార బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బోర్డోవాలా సెగ్మెంట్‌నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా 6,104 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన, ఆ పదవిలో కొనసాగాలంటే ఈ ఎన్నికలో నెగ్గి తీరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఆయనకు పట్టంగట్టారు. గతనెలలో అప్పటి ముఖ్యమంత్రి బిప్‌లాబ్ దేవ్‌ను తప్పించి ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ మాణిక్ సాహాకు బీజేపీ అధిష్ఠానం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. నాలుగో స్థానం అగర్తలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఝార్ఖండ్‌లో మందర్ అసెంబ్లి సెగ్మెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ 11,245 పైచిలుకు ఓట్లు సాధించి నెగ్గారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లి సెగ్మెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో అధికార వైసీపీకి చెందిన మేకపాటి విక్రమ్ రెడ్డి 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన సోదరుడు, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.