హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ మహిళా కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
కవితపై బండి వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో బండి సంజయ్ ఢిల్లిdలో ఉన్నారు. అయితే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఆయన మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరువుతారా..? అన్నది తేలాల్సి ఉంది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసుల్లో హెచ్చరించింది.
అయితే మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందితే విచారణకు హాజరవుతానని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 15న ఏం జరగబోతోందన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల సందర్బంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. అదే సమయంలో వివిధ పోలీసు స్టేషన్లలో బండిపై ఫిర్యాదు కూడా చేశాయి.