Saturday, November 23, 2024

వణికిస్తున్న వైరల్‌ ఫీవర్లు.. వైద్యులను ఆందోళనకు గురి చేస్తున్న కొత్త రకం వైరస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని వైరల్‌ ఫీవర్‌ వణికిస్తోంది. జ్వర బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌, ఫీవర్‌ ఆసుపత్రులలో 300 నుంచి 800 వరకు ఉండే ఓపి ఇప్పుడు ఏకంగా రోజుకు 1000 నుంచి 1500 వరకు నమోదవుతోంది. సాధారణ జ్వరంతో పాటు దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతోనే ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

కాగా, రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. కాగా, ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణంలో పెరిగిన మార్పులే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా వేడిమి పెరిగిపోవడంతో శరీరంలో అనుకోని మార్పులు వస్తాయనీ, దీంతో జలుబు, దగ్గుతో కూడిన జ్వరం వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

కొన్నిచోట్ల వర్షం, డ్రైనేజీ నీళ్లు కలవడం వల్ల తాగునీరు కలుషితం కావడం, నీటి నిల్వలు కూడా పెరిగి జ్వరాలు రావడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రతీ రోజు ఫీవర్‌ ఆసుపత్రికి 400 నుంచి 650, గాంధీ ఆసుపత్రిలో 1100 నుంచి 1400, ఉస్మానియా ఆసుపత్రిలో 1000 నుంచి 1500, నీలోఫర్‌ ఆసుపత్రిలో 800 నుంచి 1000 వరకు ఓపి నమోదవుతున్నట్లు ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొత్త రకం వైరస్‌ వైద్యులను ఆందోళనకు గురి చేస్తున్నది.

ఆసుపత్రులకు వస్తున్న పలువురు జ్వర బాధితులకు స్వైన్‌ ఫ్లూ, కోవిడ్‌-19 సంబంధిత పరీక్షలు చేయగా, ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మరికొన్ని శ్వాసకోశ సంబంధిత కేసులు రాగా, వాటి ఫలితాలు కూడా కరోనాకు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో ఈ కేసులకు శ్వాసకోశ వైరస్‌కు సంబంధం ఉండి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement