Friday, November 22, 2024

TS | వణికిస్తున్న చలి… తుపాన్‌లతో పెరిగిన శీతలగాలులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సహజంగా చలి కాలం ప్రారంభానికి తోడు మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో తెలంగాణపై చలి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతోపాటు మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో తెల్లవారుఝామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంటోంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో మంచు దుప్పటీ వీడడం లేదు. దీంతో ఉదయం 10 గంటల దాకా బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతోపాటు చలిగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు చలికి గజ గజ వణికిపోతున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో పొగమంచు కురుస్తోంది. మెదక్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డిలో ఉష్ణ్రోగ్రతలు 15 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 12.7 డిగ్రీల, భద్రాచలంలో 18.5, హకీంపేటలో 15.2, దుండిగల్‌లో 15.7, హన్మకొండలో 14.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.1, ఖమ్మంలో 16. 6 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 19.1 డిగ్రీలు, నల్గొండలో 17.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 16.9 డిగ్రీలు, రామగుండంలో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


కాగా ఇప్పటికే మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో చలి తీవ్రత పెరగడంతోపాటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే మరో తుఫాన్‌ విరుచుకుపడనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్‌ 16న ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని అంచనా వేస్తోంది. డిసెంబర్‌ 18నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడన ఆవర్తనం శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపుగా కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం భారీ తుఫాన్‌ గా మారే అవకాశం కూడా ఉందని చెబుతోంది. ఇదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement