Saturday, November 23, 2024

మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైన శివాలయాలు.. భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లకు ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. ఇప్పటికే ప్రధాన ఆలయాలన్నింటిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని కోణాల్లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వేములవాడ, కీసర గుట్ట, ఝరాసంగం, కొమురవెల్లి, ఏడుపాయల తదితర ప్రధానమైన శివాలయాల వద్ధ భక్తజనం పోటెత్తే అవకాశాలుండడంతో పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయాల వద్ద జిల్లాస్థాయి అధికారుల కమిటీ పర్యవేక్షణ కొనసాగుతోంది. ‘కోవిడ్‌’ అనంతరం మొదటిసారి ఘనంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి కావడంతో అధికార యంత్రాంగం అన్ని కోణాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. మరోవైపు రేపు ఉపవాస ధీక్షలో ఉంటున్న వాళ్లంతా శుక్రవారం మార్కెట్లకు పరుగులు తీయడంతో పండ్ల మార్కెట్లన్నీ క్రిక్కిరిసిపోయాయి. పరమేశ్వరుని భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ పర్వదినం శివరాత్రి పండుగ నాడు కోట్లాది మంది భర్తులు విధిగా ఆలయాలకు వెళ్తారు. ప్రతి జిల్లాలోను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఆనందంగా గడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రధాన దేవాలయాల చోట్ల ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి వేడుకల కోసం ఈ ఏడాది ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ జరిగే వేడుకలకు రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి దాదాపు 4లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఈఓ కృష్ణ ప్రసాద్‌ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సుమారు రూ.3.03 కోట్లతో భక్తులకు సైకర్యాలు, తదితర యేర్పాట్లు జరుగుతున్నాయి. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడిచెరువు నేలంతా పందిళ్లతో నిండిపోయింది. తాగునీటి వసతితో పాటు స్నాన ఘాట్‌లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

రాత్రి జాగరణ చేసే భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపల్‌ కార్మికులు, తాత్కాలిక కార్మికులు ఆలయ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారను అధికారులు సిద్ధం చేశారు. భక్తులకు వైద్య సహాయం అందించేందుకు 11 ఎమర్జెన్సీ సెంటర్లు, 163 మంది వైద్య సిబ్బందిని నియమించారు.

జాతర జరిగే ప్రాంతాలైన తిప్పాపూర్‌, జగిత్యాల బస్టాండ్‌ ప్రాంతాలు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్‌, రాజేశ్వరపురం, ప్రధాన ఆలయం ఎదురుగా, భీమేశ్వరాలయం వద్ద, సంస్కృత కళాశాలల్లో అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడకు వెళ్లే అన్ని రహదారుల్లో అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు అంబులెన్స్‌లు, రెండు రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచారు. రద్దీ సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం దర్శనం, క్యూలైన్లు, భక్తుల విశ్రాంతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేసే వారికోసం కూడా ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మొత్తం 40 ప్రత్యేక బస్సులను జాతర స్పెషల్‌ కోసం నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్‌ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈసారి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారన్న ఆలోచనతో ఆర్టీసీ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దృష్టి సారించారు. కీసర గుట్టలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వ తేదీ నుండి 21 వరకు జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ పరిశీలించారు. ఐదు రోజుల క్రితం కీసర గుట్ట శివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోస్తవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్లెక్స్‌లు పూర్తిగా బ్యాన్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు గ్రామమైన ఖమ్మం జిల్లా మధిరలో దక్షిణ కాశీగా పేరుందిన శ్రీమృత్యుంజయ స్వామి ఆలయం ఉంది. ఈ శివాలయం మహాశివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముసాబైంది. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలకు రెండు రాష్ట్రాల్లోని సమీప గ్రామాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ కాశీలోని పుణ్యక్షేత్రాన్ని పోలినట్టుగా ఈ ఆలయం పడమర దిక్కుకు తిరిగి ఉండటం విశేషం. ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా కాశీలోని గంగా నదిలాగ ఈ దేవాలయంలో వైరా నది ప్రవహిస్తుంది. ఉత్తరం వైపున హిందూ స్మశాన వాటిక ఉంది. కడియాలయంలో మహాశివరాత్రి పర్వదినాన స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలోని మహాశివరాత్రి పురస్కరించుకుని రామప్ప దేవాలయంలో ఈనెల 18, 19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు ప్రశాంతంగా రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోనేందుకు భారీ గేట్లతో క్యూలైన్లు సిద్ధం చేశారు. మూడు రోజుల ఉత్సవంలో భాగంగా నిర్వహించే శివపార్వతుల కల్యాణం, రుద్రాభిషేకం, బలిహరణం, దీపోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమాల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరు చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయాలకు కేంద్రంగా బాసిల్లుతున్నది. బషీరాబాద్‌ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో దాదాపు 400 ఏండ్ల చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ఏకాంబర రామలింగేశ్వర ఆలయం ప్రతియేటా భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రసిద్ధి గాంచినవి. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని జిల్‌ఆ అధికార యంత్రాంగం ఇక్కడ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. తాండూరు మండలం అంతారం తండాలో పద్నాలుగేండ్ల క్రితం భూకైలాస్‌ దేవాలయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాసూపవార్‌ నిర్మించారు. ఈ ఆలయ పరిసరాల్లోని భారీ 64 అడుగుల ఎత్తున శివుడి విగ్రహం, 24 అడుగుల ఎత్తున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయ పరిసరాల్లో నిర్మితమైన గిరిజనుల ఆరాధ్యదైవమైన మారెమ్మ, సేవాలాల్‌ దేవాలయాలు కూడా భక్తులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. శివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా కనిపించేందుకు ప్రత్యేక విగ్రహాలతో ముస్తాబు చేశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ 65వ జాతీయ రహదారికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేతకీ సంగమేశ్వర ఆలయంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నందున ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, పోలీస్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివస్వాములు కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఇరుముడులను సమర్పించుకుంటారు. వీరికోసం ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి వసతి, వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం జహీరాబాద్‌ నుంచి ఝరాసంగం వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ననడుపుతున్నారు.

నారాయణఖేడ్‌ మండల పరిధిలోని తుర్కపల్లి సంగమేశ్వరుని గుట్టలో ఉన్న ఆలయం, పట్టణంలోని కాశీనాథ్‌ ఆలయం, పంచగామలోని నాగలింగేశ్వర దేవస్థానం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. తుర్కపల్లి గ్రామశివారులోని సంగమేశ్వరుని గుట్టలో ఉన్న శివలింగాన్ని 30 ఏళ్ల క్రితం ప్రతిష్ఠింపచేసి అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామస్థులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సంగమేశ్వర స్వామి ఆలయం ఆవరణలో మూడేళ్ల క్రితం కోనేరు కూడా నిర్మించారు. ఈనెల 18, 19 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నారాయణఖేడ్‌ మండలం పంచగామలోని నాగలింగేశ్వర ఆలయంలో పూజాకార్యక్రమాలతో పాటు- సప్తాహా, సహస్ర రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించనున్నారు. ఈ నెల18న శివరాత్రి పురస్కరించుకుని ఉదయం 10గంటల నుంచి సామూహిక లింగార్చన కార్యక్రమాలు ఏకాంబ పీఠాధిపతి కరణ్‌ గజేంద్రభారతి మహారాజ్‌గారితో కీర్తనలు, వారీకార్‌ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement