శ్రీలంకతో టీమిండియా ఆడిన తొలి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో యువ క్రికెటర్లు తమ సత్తా చాటి కొత్త రికార్డులు నమోదు చేశారు. ముఖ్యంగా కెప్టెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 95 బంతులు ఆడి 86 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న 14వ ఇండియన్‌గా నిలిచాడు.
తొలి వన్డేలో 23 పరుగులు చేయగానే శిఖర్ ధావన్ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుని గంగూలీని వెనక్కి నెట్టాడు. తక్కువ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. గంగూలీ 147 ఇన్నింగ్సుల్లో 6 వేల పరుగులు చేయగా, ధావన్ 141 ఇన్నింగ్స్‌లోనే ఇది సాధించడం విశేషం. 123 ఇన్సింగ్సుల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసి హషీం ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు.
మరోవైపు శిఖర్ ధావన్ వన్డేల్లో 50వ సారి 50కి పైగా పరుగులు సాధించాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు 33 హాఫ్ సెంచరీలు, 17 సెంచరీలు చేశాడు. ఇలాంటి ఫీట్ అందుకున్న 10వ భారతీయ క్రికెటర్‌గా శిఖర్ నిలిచాడు. సచిన్ అందరికన్నా ముందున్నాడు. శ్రీలంకపై వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన రికార్డును కూడా శిఖర్ ధావన్ తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై ధావన్ 17 ఇన్నింగ్సులు ఆడి వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలో 50 ప్లస్ పరుగులు చేసిన శిఖర్ ధావన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలోనే 50 ప్లస్ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్‌గా శిఖర్ నిలిచాడు. అతడి కన్నా ముందు అజిత్ వాడేకర్, రవిశాస్త్రి, సచిన్, అజయ్ జడేజా ఉన్నారు. కెప్టెన్‌గా ధోనీ తన రెండో వన్డేలో 50 ప్లస్ పరుగులు సాధించాడు.
ఈ వార్త కూడా చదవండి: శృంగారం కట్టడికి ఒలింపిక్స్ నిర్వాహకుల వింత ఆలోచన