న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ ఎండీ బోడపాటి శేజల్ మంగళవారం ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. నిరనస తెలపడం కోసమే పాలాభిషేకం చేశానని, పాలాభిషేకంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని అనంతరం ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన అన్యాయం, వేధింపులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే సీఎం కేసీఆర్ స్పందించడం లేదని శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు పడక సుఖం అందించి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ పోలీసులే తనను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని శేజల్ సంచలన ఆరోపణ చేశారు. బెల్లంపల్లి పోలీసులు దొంగలకు మద్దతుగా నిలబడ్డారని దుయ్యబట్టారు. మూడు రోజుల పాటు తనను చట్ట విరుద్ధంగా కిడ్నాప్ చేసి, తన వద్ద ఉన్న ఆధారాలను లాక్కుని, తనపైనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పడక సుఖం ఇవ్వనందుకు కక్షగట్టి ఆరిజిన్ డైరీతో సంబంధం లేని తన సోదరుడిపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె చెప్పారు.
ఏ రైతూ ఫిర్యాదు చేయకపోయినా ఎమ్మెల్యే చెప్పినందుకు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్న సీఐ బాబూరావు, ఎస్సై రాజశేఖర్, ఎస్పీ ఆంజనేయులపై చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరినట్టు ఆమె చెప్పారు. ఈ ముగ్గురు అధికారులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దగ్గరకు వెళ్లాలంటూ ఒత్తిడి చేశారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల తీరుపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేశానని శేజల్ అన్నారు. ఈ పోరాటంలో తనకు తన కుటుంబ సభ్యుల మద్దతు ఉందని వెల్లడించారు.