Sunday, November 24, 2024

TG: శెభాష్‌ ఎమ్మెల్యే.. అత్యవసర పరిస్థితిలో పురుడుపోసిన డాక్టర్ వెంకట్రావు

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైద్యుడి అవతారం ఎత్తారు. వృత్తిపరంగా ఆయన డాక్టర్ కావడంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ఒక్కసారిగా తెల్లకోటు తొడిగారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి రావటంతో.. నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడు పోశారు.

గోదావరి వరద ఉద్ధృతితో ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం స్తంభించడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం.. నిండు గర్భిణులను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించింది. అయితే అక్కడ అయిదుగురు సర్జన్లు ఉండాల్సింది కానీ ఇటీవల నలుగురు బదిలీ కావడంతో ఉన్న ఒక్క సర్జన్‌ (ఆసుపత్రి సూపరింటెండెంట్‌) కోర్టు పనిపై వెళ్లారు. మంగళవారం రోజున ఆసుపత్రిలోని గర్భిణుల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రాగా.. సిజేరియన్‌ చేయాల్సి రావడంతో మిగతా వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు.

ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి వర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. వరద సహాయక చర్యల్లో ఉన్న ఆయన.. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని గర్భిణులిద్దరికీ సిజేరియన్‌ చేశారు. ఎంఎస్‌ సర్జన్‌ అయిన తెల్లం.. గతంలో ఇదే ఆసుపత్రిలో సర్జన్‌గా సేవలందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement