న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని భారతీయ చికిత్స విభాగం ఛైర్మన్ డాక్టర్ ప్రదీప్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సారంగి ఫౌండషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ కళాకారిణి విజయలక్ష్మి నారా వేసిన చిత్రాలను హార్ట్ ఏబుల్డ్ పేరుతో దేశ రాజధానిలో ప్రదర్శిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో బుధవారం సాయంత్రం డాక్టర్ ప్రదీప్ ప్రారంభించారు. ఆయన విజయలక్ష్మి వేసిన చిత్రాలను చూసి అబ్బురపడ్డారు.
వైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైనా ఆత్మస్థైర్యంతో అద్భుతమైన చిత్రాలు వేస్తూ ఆమె ముందుకు సాగుతుండడాన్ని అభినందించారు. దివ్యాంగ కళాకారులను ప్రోత్సహిస్తూ ఆకాశంలో ఎగరాలన్న వారి కోరికను నెరవేరుస్తున్న సామాజిక కార్యకర్త ఖాజా అఫ్రీది సేవలనూ ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో బంజారా మహిళా ఎన్జీవో వ్యవస్థాపకులు డా. ఆనంద్, ఇండియన్ హెరిటేజ్ సొసైటీ ఛైర్మన్ అఫ్సర్ అలీ, నెషనల్ బాలభవన్ లెక్చరర్ మొహమ్మద్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా డా. ఆనంద్, హరిప్రియలు విజయలక్ష్మిని సత్కరించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు ఖాజా అఫ్రీది తెలిపారు.