తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయట్లేదని ఆమె చెప్పారు. వర్చువల్ పద్ధతిలో తెలంగాణలోని డ్వాక్రా సంఘాలకు చెందిన పలువురు మహిళలతో మాట్లాడిన షర్మిల వారి కష్టాలను గురించి తెలుసుకున్నారు. వడ్డీ లేని రుణం అంటూ తెలంగాణ ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం పథకాన్ని మళ్లీ అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన షర్మిల తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అభయహస్తం పథకం వైఎస్సార్ ప్రవేశపెట్టారని, ఆ పథకం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. డ్వాక్రా రుణాలన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులు, యువకులు, మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
యువకులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలను మభ్యపెట్టేలా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని చెప్పారు. ప్రజలందరూ బాగున్నారంటూ తమ పాలన బాగుందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఆమె చెప్పారు. ఇటువంటి మాటలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసమర్థత, చేతగాని తనం వల్ల 10 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలు అప్పులపాలయ్యారు. డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలి. అప్పుల పాలైన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి. ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందే అని షర్మిల ట్విట్టర్లోనూ పేర్కొన్నారు.