న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో షర్మిల రెండోరోజు కూడా ఢిల్లీలో ఉండి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో విడివిడిగా సమావేశమయ్యారు. నేతలిద్దరితో ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలిసింది.
ఖర్గేతో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కూడా ఉన్నారు. ఖర్గేతో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది అధిష్టానమే చెబుతుందని, ఒకట్రెండు రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖర్గేతో భేటీ అనంతరం ఆమె మాణిక్కం టాగోర్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం గురించి చర్చించినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలతో ఆమె జరిపిన వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. అయితే కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసి ఆహ్వానించడం కోసం ఈ భేటీలు జరిగాయని కొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవాలని షర్మిల ప్రయత్నించినప్పటికీ సమయాభావం వల్ల కలవలేకపోయారు. సాయంత్రం గం. 5.00కు ఆమె భర్త అనిల్‌తో కలిసి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.
ఇదిలా ఉంటే సాయంత్రం ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ, రాకేశ్ రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడంతో పాటు వైఎస్ షర్మిలకు అప్పగించబోయే బాధ్యతల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. పార్టీ కోసం పదవీత్యాగానికి సైతం సిద్ధమంటూ గిడుగు రుద్రరాజు ప్రకటించిన నేపథ్యంలో పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించి, గిడుగు రుద్రరాజుకు జాతీయస్థాయిలో చోటు కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది.
లేనిపక్షంలో షర్మిలకే ఏఐసీసీలో ఒక పదవి ఏదైనా కట్టబెట్టి, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలను వినియోగించుకునే అవకాశం ఉందన్న చర్చ మరోవైపు జరుగుతోంది. ఏదెలా ఉన్నా.. ఒకట్రెండు రోజుల్లో షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయంపై స్పష్టత రానుంది. బీజేపీకి ఏమాత్రం పట్టు లేని రాష్ట్రాల్లో తమ బలం పెంచుకుని వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుపొందాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఆ క్రమంలో 25 ఎంపీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తన సత్తా చాటాలని, షర్మిల వంటి నేతల పాపులారిటీని ఉపయోగించుకుని పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఆ క్రమంలో వేగంగా పావులు కదుపుతోంది.