2023లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బలపరుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాలని నారాయణ కోరారు. ఆయన ఒక్క మాట చెబితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందన్నారు.
ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై నారాయణ మాట్లాడుతూ.. ఇదంతా బూటకమని, ప్రజల్లో భ్రమను కలగించడం ద్వారా వారి మెప్పు పొందేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు జల వివాదానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రో ధరలపై మాట్లాడుతూ.. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ ఆహ్వానం