న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల శకటాలు సిద్ధమవుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీలోని రక్షణ శాఖకు చెందిన రంగ్‌శాల మైదానంలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. సోమవారం ఈ శకటాలను రక్షణ శాఖ మీడియాకు ప్రదర్శించింది. ఈ ఏడాది 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ పలు శాఖల శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు స్పెషల్ ఫోర్సెస్, పారామిలటరీ బలగాలు, ఇతర సాయుధ బలగాలు ప్రతియేటా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు “ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు – జన సామాన్య ప్రజాస్వామ్య యోధులు” థీమ్‌తో తెలంగాణ శకటం తయారవుతుండగా… “ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం” ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శనకు ముస్తాబవుతోంది.
తెలంగాణ శకటం
ఈనెల 26వ తేదీన కర్తవ్య్‌పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతోంది. వచ్చే రెండేళ్ల పాటు కూడా తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015, 2020 సంవత్సరాల్లో మాత్రమే తెలంగాణ శకటం వేడుకల్లో పాల్గొంది.
స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలిపే విధంగా రూపొందించిన శకటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన పోరాట యోధులైన కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తోడ్పాటుతో అతి స్వల్ప కాలంలోనే రాష్ట్ర శకటం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఆదివాసీ గిరిజనుల స్వేచ్ఛ, గౌరవం, హక్కుల కోసం కొమరంభీం, రాంజీ గోండ్‌లు పోరాటాలు చేశారు.
“జల్, జంగల్, జమీన్” నినాదాలతో వారు పోరాటాలు చేశారు. రైతులు, రైతు కూలీలపై భూస్వాములు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మగా పిలుచుకునే చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటం గ్రామీణుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. మహిళా సాధికారత, ఆత్మ విశ్వాసం, ధైర్యానికి ప్రతిరూపంగా చిట్యాల ఐలమ్మ నిలిచింది. ఈ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణా ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.