Tuesday, November 19, 2024

AP | మరో పదేళ్ళు ఉమ్మడినే ఉంచాలి.. పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్

అమరావతి బ్యూరో ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియడం పట్ల పీసీసీ మాజీ చీఫ్‌ డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని డిమాండ్‌ చేశారు. జూన్ 2న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరించ‌కుండానే శాశ్వతంగా ముగింపు పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీకి తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కేంద్రం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన తెలియజేసారు.

విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతమైన హైదరాబాద్‌లోని పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను గ‌వ‌ర్న‌ర్ కు అప్పగించారని, ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తులను, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్ చేతిలో ఉండేవ‌క‌ని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, రేపటి నుంచి ఆస్తుల రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని శైలజానాథ్‌ ప్రశ్నించారు.

సెక్షన్-95 ప్రకారం విద్యార్థులకు పదేళ్లపాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలని, ఆర్టికల్-317డీ ప్రకారం అడ్మిషన్ల కోటాను పదేళ్లపాటు కొనసాగించాలని, ఎంసెట్ సహా 7 రకాల ప్రవేశ పరీక్షలు కూడా ఉమ్మడిగా జరిగాయని గుర్తు చేశారు. ప్పటి వరకు ఆ పరీక్షల నోటిఫికేషన్లు జూన్‌ 2కు ముందే విడుదల కావటంతో ఉమ్మడి విద్యార్థి, విద్యార్థినిలకు అవకాశం కలిగిందని శైలజానాథ్ తెలిపారు. ఈ ఒక్క విద్యా సంవత్సరం మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారని, వచ్చే ఏడాది నుండి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందని ఆయన ఆరోపించారు.

10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారిందని, అపెక్స్‌ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని, దీనిపై కేంద్రం ఎటూ తేల్చకపోవటం పై శైలజానాథ్ ఆగ్రహం వ్యక్త పరిచారు. రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదని, 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపినప్పటికి ఏపీ ప్రభుత్వం ముందుకురాకపోవటంతో వీటి విభజన పూర్తికాలేదని తెలిపారు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా జరగలేకపోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు.

స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినా ఇప్పటి వరకు ఇరు ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టకపోవటం దురదృష్టకరమని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేసారని దుయ్యబట్టారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా కోల్పోవడం తో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు లో అనే కష్టాలు అలుముకుంటాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

గత 10 సంవత్సరాలలో ఏపీ కి రాజధాని కూడా లేకుండా పోయిందని, వ్యక్తిగత పౌరుషాలతో రాష్ట్ర లో కనీసం ఒక్కటటంటే ఒక్క మహా నగరాన్ని కూడా ఈ ప్రభుత్వాలు నిర్మించలేదని విమర్శించారు. ఇకనైనా అన్నీ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండా ప్రక్కన పెట్టి కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకుని ఏపీ రాజధానిని నిర్మించుకునే వరకూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా 2014 పునర్విభజన చట్టాన్ని సవరించి కొనసాగించాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement