Friday, November 22, 2024

పశ్చిమంపై షా గురి.. జాట్లు చేజారకుండా వ్యూహాలు..

గణితంలో ఒకటి, ఒకటి కలిస్తే రెండు అవుతుంది, కానీ రాజకీయాల్లో అలా కాదు. ఒకటి, ఒకటి కలిస్తే సున్నా కూడా కావొచ్చు. లేదంటే లేదంటే 11 కూడా కావొచ్చు. బలమైన ఓటు బ్యాంకు కల్గిన రెండు పార్టీలు కలిస్తే తిరుగులేని విజయం ఖాయం అనుకున్న సందర్భాల్లో, ఘోరమైన పరాజయాలు ఎదురయ్యాయి. ఒక్కోసారి ఊహకందని భారీ విజయాలు కూడా నమోదయ్యాయి. పార్టీలు కలిసినట్టుగా వాటి ఓటుబ్యాంకులు ఎప్పుడు కలుస్తాయో, ఎప్పుడు వికటిస్తాయో కచ్చితంగా అంచనా వేయలేని రాజకీయాల్లో, పొత్తులు ప్రత్యర్థులను కలవరపెడుతూనే ఉంటాయి. తాజాగా యూపీలో డజనుకు పైగా చిన్న చిన్న పార్టీలతో జతకట్టిన సమాజ్‌వాదీ పార్టీ, అధికార బీజేపీకి గట్టి సవాల్ విసురుతోంది. ముఖ్యంగా పశ్చిమ యూపీలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో సమాజ్‌వాదీ పార్టీ జతకట్టడం బీజేపీని కలవరపెడుతోంది. ఈ పొత్తులతో బీజేపీకి కలిగే నష్టాన్ని నివారించేందుకు ఏకంగా కమలదళ అగ్రనేత అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

2014లో మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత జరిగిన 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వరుస విజయాలు అందించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యువనేతలు అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ కలసికట్టుగా ప్రచారం చేసినా, బీజేపీ దూకుడుకు ఏమాత్రం కళ్లెం వేయలేకపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోనే బలమైన రెండు పక్షాలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జట్టుకట్టి పోటీచేసినా.. ఫలితం లేకపోయింది. ఒకరి ఓటు మరొకరికి బదిలీ కాకపోవడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కానీ ఎస్పీ, ఆర్ఎల్డీ కలయిక మాత్రం బీజేపీని కలవరపెడుతోంది. పశ్చిమ యూపీలో బలమైన జాట్ ఓటు బ్యాంకు కల్గిన జయంత్ చౌధురి నేతృత్వంలోని ఆర్ఎల్డీ, నిర్ణయాత్మక సంఖ్యాబలం కల్గిన యాదవులు, ముస్లింలు ఓటుబ్యాంకుగా కల్గిన ఎస్పీతో కలవడం వల్ల బీజేపీ విజయావకాశాలు చాలా వరకు సన్నగిల్లుతున్నాయి. 2014, 2017, 2019 ఎన్నికల్లో జాట్ల మద్ధతుతోనే పశ్చిమ యూపీలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించి, అధికారాన్ని సాధించగల్గింది. కానీ వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగిన రైతుల ఉద్యమం కారణంగా వ్యవసాయమే వృత్తిగా కల్గిన జాట్లు బీజేపీకి క్రమంగా దూరమవుతూ వచ్చారు. దూరమైన జాట్లు, తమ సొంత కుల పార్టీ ఆర్ఎల్డీకి ఓటేసినా పెద్ద ప్రమాదం లేదు. కానీ ఆర్ఎల్డీ సమాజ్‌వాదీతో జట్టుకట్టడంతోనే మొత్తం సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక్కడ తేడా వచ్చిందంటే యూపీ పీఠం చేజారిపోవడమే కాదు, 2024లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న కమలనాథుల కలను కూడా చెదిరిపోయే ప్రమాదం ఉంది.

అందుకే జాట్ల గడ్డపై కుల సమీకరణాలకు అధిగమించే ‘మతం’ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండాను ఈ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. రామజన్మభూమి అయోధ్యలో దివ్య రామ మందిర నిర్మాణం, హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో భవ్య కాశీ కారిడార్ నిర్మాణంతో పాటు ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానం ‘మథుర’ ప్రస్తావన తీసుకొస్తోంది. అయోధ్య, కాశీ రూపురేఖలు మార్చిన తాము మథురను ఎలా విస్మరిస్తాం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించినా, మథురలో శ్రీకృష్ణుడికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మిస్తామంటూ ఇతర బీజేపీ నేతలు చెప్పినా దీని లోగుట్టు ‘హిందు’ ఓటు బ్యాంకును సమీకృతం చేయడమేనని అందరికీ అర్థమవుతోంది.

కదనరంగంలో కమలదళ అగ్రనేత

- Advertisement -

పశ్చిమ యూపీలో ముస్లింలకు, జాట్లకు మధ్య ఉండే సహజ విరోధం ఇంతకాలం బీజేపీకి వరంగా మారింది. జాట్లు తమ సొంత ఇంటి పార్టీ ఆర్ఎల్డీని కాదని మరీ బీజేపీ వెంట నడిచేందుకు ఇది దోహదం చేసింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో జాట్లు ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి వెంట నడిచేలా ఉన్నారు. అందుకే అమిత్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రచారానికి వేదికగా చేసుకున్న కైరానా, మథుర ప్రాంతాలు పశ్చిమ యూపీలో భాగమే. పైగా మత ఘర్షణల కారణంగా హిందువులు పెద్ద సంఖ్యలో నగరాన్ని విడిచి వలసపోవడంతో అప్పట్లో కైరానా వార్తల్లో నిలిచింది. ఇక శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథుర హిందువులకు పవిత్రమైన ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్ షా, “అఖిలేశ్‌ని ఎన్నుకోవడం అంటే గూండారాజ్‌ను మళ్లీ ఆహ్వానించడమే. ఆజం ఖాన్ అరెస్టయ్యాడు. అతనిపై అనేక నేరారోపణలు, అభియోగాలున్నాయి. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించే నువ్వు (అఖిలేశ్ యాదవ్) శాంతిభద్రతల గురించి మాట్లాడ్డానికి సిగ్గుపడాలి” అంటూ మాటల తూటాలు పేల్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా సమాజ్‌వాదీ పార్టీ చేసే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

బీజేపీలో అపర చాణక్యుడు

2014లో కేంద్రంలో అధికారంలోకి రావడం సహా దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన విజయాల వెనుక అమిత్ షా రాజకీయ చతురతే కారణమని రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా యూపీ గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత పార్టీ జాతీయాధ్యక్షుడిగా తన వ్యూహాలను దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్నా సరే, పార్టీకి వ్యూహకర్తగా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మైక్రో లెవెల్ మేనేజ్‌మెంట్‌లో అమిత్ షా దిట్ట. సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రామస్థాయి వరకు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అయితే అమిత్ షా బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరించారు. మరింత సూక్ష్మ స్థాయికి వెళ్లి, ఓటర్ల జాబితాలో 30 మంది ఓటర్లతో ఉండే ప్రతి పేజి(పన్నా)కి ఒక బీజేపీ కార్యకర్త (పన్నా ప్రముఖ్)ను నియమించారు. అంతేకాదు, కార్యకర్తలతో నిర్వహించే సమావేశాల్లో వారిని పేరుపేరునా పలకరిస్తూ ఆశ్చర్యపరిచేవారు. తద్వారా చాలాకాలంగా అధికారానికి దూరంగా ఉన్న యూపీలో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేవారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదును మరింత విస్తృతం చేసి, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సభ్యులు కల్గిన రాజకీయ పార్టీగా బీజేపీని తీర్చిదిద్దారు. అలాంటి అపర చాణక్యుడే పశ్చిమ యూపీలో పరిణామాలపై కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది.

పగలు ప్రచారం, రాత్రి మంత్రాంగం

అమిత్ షా పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. పగలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, రాత్రిపూట నిర్వహించే సమావేశాల్లో వ్యూహరచన చేస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతి నియోజకవర్గం గురించి అమిత్ షా కు సమగ్ర అవగాహన ఉంది. పైగా ప్రతి నేత చరిత్ర తన గుప్పిట్లో పెట్టుకుంటారు. వారిపై ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతం, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఉండే స్థానిక సామాజిక సమీకరణాలను సైతం అమిత్ షా ఏమాత్రం విస్మరించరు. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తుంటారు. యూపీ ఎన్నికల కోసం గత ఏడాది నుంచే కసరత్తు మొదలుపెట్టారు. గత డిసెంబర్ నుంచి యూపీలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. అనేక రాత్రిళ్లు మేధోమథనం జరిపారు. బీజేపీ విజయాల్లో అమిత్ షా రాత్రిపూట నిర్వహించే సమావేశాల పాత్ర చాలా కీలకం. 2017లో కూడా రాజకీయంగా ప్రాముఖ్యత కల్గిన చిన్న చిన్న గ్రామాల్లో సైతం బస చేశారు. తాజాగా పశ్చిమ యూపీలో పార్టీ ప్రచారం ఊపందుకునేలా చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చేసే ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ఈ ప్రచారానికి అమిత్ షా యే నాయకత్వం వహించారు.

జాట్ల మనసు గెలుచుకునేదెలా?

ముస్లిం జనాభా కూడా ఎక్కువ శాతం ఉండే పశ్చిమ యూపీలో జాట్లకు, ముస్లింలకు మధ్యనున్న వైరం బీజేపీకి ఇంతకాలం వరంగా మారింది. ముస్లింల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం కోసం జాట్లు బీజేపీని ఆదరిస్తూ వచ్చారు. కానీ రైతుల ఆందోళన తర్వాత పరిస్థితి మారడంతో మళ్లీ జాట్ల మనసు గెలుచుకోవడం కోసం బీజేపీ గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జనవరి 26న అమిత్ షా జాట్ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ జాట్ నేత ప్రవేశ్ వర్మ ఇంట్లో నాలుగ్గోడల మధ్య జరిగిన ఈ సమావేశంలో జాట్లను బీజేపీని వీడి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సమస్య ఉన్నా సరే, కేంద్రం ఎప్పుడూ జాట్లకు సన్నిహితంగానే ఉందని వారికి గుర్తుచేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో జాట్లు అందించిన మద్ధతును గుర్తుచేస్తూ, అందుకు కమలదళం కృతజ్ఞతాభావంతో ఉందని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు జాట్ల పార్టీగా పేరున్న రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌధురికి కూడా బీజేపీ చెలిమి సంకేతాలు పంపింది. ఆయన తప్పుడు భాగస్వామి (అఖిలేశ్)ని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఆర్ఎల్డీ వస్తానంటే బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పరోక్ష ఆహ్వానం పంపారు. అయితే ఈ ఆహ్వానాన్ని జయంత్ తిప్పికొట్టారు. రైతు ఉద్యమంలో చనిపోయిన 700 మంది రైతు కుటుంబాలకు ఈ ఆహ్వానం పంపి ఉండాల్సిందంటూ ఘాటుగా బదులిచ్చారు. జయంత్ సమాధానం ఎలా ఉన్నా, జాట్ పెద్దలతో జరిపిన సంప్రదింపులకు తోడు గ్రామస్థాయిలోనూ జాట్ పెద్దలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. తద్వారా వారి మనసు గెలుచుకుని, యూపీలో మరోసారి అధికార పీఠాన్ని గెలుచుకోవాలని చూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement