Sunday, November 24, 2024

SFI Meet – రాజ్యాంగ‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉద్య‌మించాలి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖమ్మం : భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) పూర్వ విద్యార్థి నాయకులంతా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ నాగేశ్వర్ తెలిపారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ వేదికగా 1970 నుండి 2024 వరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పని చేసిన – చేస్తున్న వారందరు కలిసి ఏర్పాటు చేసిన ఆత్మయ సమ్మేళనంలో ఆయ‌న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అంతకు ముందు జెండావిష్కరణతో ప్రారంభమైన సమ్మేళన కార్యక్రమానికి పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు వేలాదిగా విచ్చేశారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు, ఉద్వేగ భరిత ఉపన్యాసాలతో కార్యక్రమానికి విచ్చేసిన వారు గత ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ప్ర‌శ్నించే త‌త్వంతోనే ఎస్ఎఫ్ఐ ప్ర‌స్థానం ప్రారంభం

ఈ సందర్భంగా ప్రొఫెస‌ర్‌ నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వంతోనే ఎస్ఎఫ్ఐ ప్రస్థానం ప్రారంభమవుతుందని తెలిపారు. ఒక్కసారి ఎస్ఎఫ్ఐ ఉద్యమంతో మమేకమైతే, ప్రశ్నించే తత్వం పెంపొందుతుందని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆచరణలో మాత్రం స్పందించే గుణం, ప్రశ్నించే తత్వం వెంటాడుతూనే ఉంటుందని అన్నారు.

ఏకతాటిపైకి తెచ్చిన అద్భుత ప్ర‌య‌త్నం

- Advertisement -

ప్రొఫెస‌ర్‌ నాగేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చి అద్భుత ప్రయత్నమే ఈ స‌మ్మేళ‌న‌మ‌ని, పూర్వవిద్యార్థి ఉద్యమ వేదిక నాయకులను అభినందించారు. ఇదే ఉత్సాహంతో సంపూర్ణ విద్యార్థులుగా ఎదిగిన పూర్వ విద్యార్థి నాయకులు రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలని కోరారు. రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మత విశ్వాసాలకు తాము వ్యతిరేకులం కాదని, మతం పేరిట సాగుతున్న విధ్వంసానికి వ్యతిరేకమని నాగేశ్వ‌ర‌రావు తెలిపారు.

ఎందరికో రాజ‌కీయాల్లో ఓన‌మాలు నేర్పిన ఎస్ఎఫ్ఐపూర్వ ఎస్ఎఫ్ఐ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ అధ్యయనం పోరాటం నినాదంతో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ దేశంలో ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిందని అన్నారు. స్వాతంత్య్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఉద్యమించిన పూర్వ విద్యార్థి నాయకులు, కార్పొరేట్ కమ్యూనల్ రాజ్య స్థాపనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి ఉద్యమ నాయకుడు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, సీనియర్ నాయకులు, ఎం.సుబ్బారావు, సాయిబాబా, పోతినేని సుదర్శన్, దేవేంద్ర, నాగేశ్వర్, కళ్యాణం వెంకటేశ్వరరావు సహా వందలాది మంది సీనియర్ నాయకులు, ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన దాదాపు 1500 మందికి పైగా మాజీ నాయకులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement