జైలులో తోటి ఖైదీపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ముంబైలో జరిగింది. అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరాలతో జైలుకు వచ్చిన ఇద్దరినీ ఒకే బ్యారక్‌లో ఉంచారు. దీంతో వారి మధ్య లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తోంది తోటి ఖైదీ(20) పై నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టు సమాచారం. బాధితుడు జైలు అధికారులకు ఈ విషయం తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు తనను బెదిరించాడని బాధితుడు తెలిపాడు. నిందితుడిపై పోలీసులు అసహజ నేరాలు సహా పలు సెక్షన్ల కింద ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుత చట్టాల ప్రకారం 16 ఏండ్లు పైబడిన పురుష బాధితులపై లైంగిక దాడిని భారత శిక్షా స్మృతి గుర్తించదు. పురుషుడు ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తేనే దాన్ని లైంగిక దాడిగా లెక్కలోకి తీసుకుంటారు. చిన్నారులు, బాలురపై జరిగే లైంగిక దాడులను పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు.