Wednesday, November 20, 2024

TS | మరో మూడు రోజులు తీవ్రమైన చలి.. వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్రమైన చలికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా కూడా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలితోపాటు చలిగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో మరో మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉండడంతోపాటు మరింత విపరీతంగా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి పంజా విసురుతుండడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. గత రెండు రోజులుగా తూర్పు దిశగా చలిగాలులు వీస్తున్నాయి. డిసెంబరు 17వతేదీ తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

గడిచిన 2 4గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్‌కు చేరింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత 10 నుంచి 13 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు చెప్పారు. తీవ్రమైన చలితోపాటు చలిగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

చలి పెరిగిన నేపథ్యంలో గుండెజబ్బులున్న వారు, మధుమేహం, హైబీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు బయటకు రావద్దని అధికారులు సూచించారు.చలి ప్రభావం వల్ల గొంతులో ఇన్పెక్షన్లు, జలుబు వ్యాధులు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని బయటకు రావద్దని వైద్యులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement