పర్యావరణహిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపార విస్తరణ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంటును సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధారంగా కంపెనీ ఏర్పాటు చేస్తోంది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుండి రోజుకు 500 కేజీల పరిమాణం గల కార్బన్ డయాక్సైడ్ ను సేకరించి, దీనిని హైడ్రోజన్ వాయువుతో కుదింపు చేసి, చివరిగా మిథనాల్ ద్రవాన్ని పొందే ప్రక్రియను ఈ ప్లాంట్ లో చేపట్టనున్నారు.
ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ తెలియజేశారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ఈ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఇ.ఎస్.పీ. (ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్) ను నెలకొల్పడం జరిగిందన్నారు.
ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి అనుమతించబడిన వాయువు నుండి మాత్రమే ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువును స్వీకరించడం జరుగుతుందన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నికి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు.
పూర్తయిన సివిల్ నిర్మాణాలు.. ఈనెలలో యంత్రాల ఏర్పాటు..
కార్బన్ డయాక్సైడ్ నుండి మిథనాల్ తయారు చేసే ప్లాంట్ లో ఇప్పటికే సివిల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డైయాక్సైడ్ను సంగ్రహించే యూనిట్ ను, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్ ను, కంప్రెషన్ యూనిట్ ను, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్ర విభాగాలలో కొన్ని ఇప్పటికే నిర్మాణ ప్రాంతానికి చేరుకోగా మరికొన్ని ఈ నెలాఖరుకు చేరుకోనున్నాయి.
సింగరేణి సౌజన్యంతో, నిర్మాణ సారథ్యంలో..
సింగరేణి సౌజన్యంతో, నిర్మాణ సారథ్యంలో కోల్ ఇండియా అనుబంధ రీసర్చ్ యూనిట్ అయిన సీఎం పిడిఐఎల్ వారి ఆర్థిక సహకారంతో, ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణ బాధ్యత మరియు ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ మరియు బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అప్పగించడం జరిగింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చు కానుంది.
మిథనాల్ తో బహువిధ వ్యాపార ప్రయోజనాలు
ఈ ప్రయోగాత్మక ప్లాంటు ప్రారంభమైన తర్వాత రోజుకు 180 కేజీల మిథనాల్ తయారు జరగనుంది. ప్రస్తుతం దీనిని ఎవరికీ విక్రయించ బోవడం లేదు. ప్రయోగం విజయవంతం అయితే పెద్ద ఎత్తున మిథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సింగరేణి సంసిద్ధంగా ఉంది. మిథనాల్ ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాల తయారీలో, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు.
కనుక వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా పెద్ద ఎత్తున మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ఈ మిథనాల్ ను వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ అమ్ముకునే అవకాశం ఉంది. దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్ లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా ఉత్పత్తి దిశగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతం అయితే అది భవిష్యత్లో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా దేశానికి ఎంతో ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.