Saturday, November 23, 2024

Delhi | విశాఖలో సీజీహెచ్ఎస్ స్టేట్ డైరక్టరేట్ ఏర్పాటు చేయండి : ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) స్టేట్ డైరక్టరేట్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాన్షు పంత్‌ను కోరారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న సీజీహెచ్ఎస్ సదుపాయాలు సరిపోవని, కొత్త వెల్‌నెస్ సెంటర్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జీవీఎల్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఓ ప్రకటన జారీ చేసిన ఎంపీ జీవీఎల్, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత కూడా  హైదరాబాద్‌లోనే సీజీహెచ్ఎస్ స్టేట్ డైరక్టరేట్ కొనసాగుతోందని, ఈ కారణంగా ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నంలోని సీజీహెచ్ఎస్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక సీజీహెచ్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం ఉందని, హైదరాబాద్‌ నుంచి సీజీహెచ్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాల్సిన అవసరం ఉందని జీవీఎల్‌ తెలిపారు. విశాఖపట్నంలో కనీసం మరో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు తక్షణమే అనుమతి ఇవ్వాలని, సీజీహెచ్‌ఎస్‌ కార్యకలాపాలకు తగిన సిబ్బందిని నియమించాలని కోరారు.

- Advertisement -

విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 సెంట్ల స్థలాన్ని సేకరించేందుకు రూ.2.9 కోట్లు విడుదల చేయాలని ఎంపీ జీవీఎల్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కోరారు. అన్ని అభ్యర్థనలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి చాలా సానుకూలంగా స్పందించారని జీవీఎల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement