న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతాలు, పదోన్నతులు, పెన్షన్ సమస్యలు, బకాయిలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఏర్పాటు చేయవలసినదిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనను న్యూఢిల్లీలో కలిసిన ఎంపీ ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, పోస్టులకు సంబంధించిన అధికారుల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని, దీని ద్వారా 91.18 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, ఎంతో ప్రాధాన్యం కలిగిన క్యాట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసినదిగా కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ట్రిబ్యునల్ బెంచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్యోద్యోగులకు సేవలు పొందుతున్నారని శ్రీకృష్ణ, కిరణ్ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు.
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సర్వీసులో ఉన్న, రిటైర్డ్ అయిన 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఉన్నారని తెలిపారు. ఏపీలో క్యాట్ బెంచ్ లేకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలపై పోరాడటానికి హైదరాబాద్ వెళ్లవలసి వస్తోందని, అంతర్రాష్ట్ర ప్రయాణంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రవ ఉద్యోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, బాధిత ఉద్యోగులకు సత్వర న్యాయం అందించేందుకు గుంటూరు జిల్లాలో శాశ్వత క్యాట్ బెంచ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసినదిగా శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని క్యాట్ బెంచ్‌లో న్యాయవ్యవస్థ సభ్యులు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ ఐఏఐస్ అధికారి వంటి వారు అడ్మినిస్ట్రేటివ్ సభ్యులుగా ఉన్నారని, చాలాసార్లు ఆ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో క్యాట్ ఏర్పాటు ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం దొరుకుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.