హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులలో పీజీ వైద్య విద్యార్థుల సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రాలలోని ఆసుపత్రులలో రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు జిల్లా స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ ఎలా పని చేస్తుంది ? క్షేత్ర స్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల తీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల తీరు పర్యవేక్షణ, వాటి ప్రణాళికలు ఎలా ఉంటాయో తెలుసుకునే బాధ్యతలను పీజీ వైద్య విద్యార్థులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పీజీ వైద్య విద్యార్థులకు జిల్లా రెసెడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్సీని) అమలు చేయాలని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసి) నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 20 నుంచి కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర్ర వైద్య, విద్య సంచాలకులు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులు రోటేషన్ పద్దతిలో జిల్లా ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలి. ఎండీ, ఎంఎస్ చేసే పీజీ వైద్య విద్యార్థులంతా ప్రతీ 3 నెలలకోసారి రొటేషన్ పద్దతిలో జిల్లా ఆసుపత్రి, జాతీయ ఆరోగ్య మిషన్ పథకాలలో పని చేయాల్సి ఉంటుంది. దీనిని వైద్య విద్యార్థుల కోర్సులో భాగంగా పరిగణిస్తారు. 3,4,5 సెమిస్టర్లలో ఉన్న పీజీలంతా రోటేషన్ పద్దతిలో వైద్య విద్యార్థులు సేవలు అందిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద పనిచేసే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ నుంచి క్షేత్ర స్థాయిలో రోగ నివారణ చర్యలు, రిహాబిలిటేషన్ సేవల గురించి పీజీ విద్యార్థులు నేర్చుకోవడమే డీఆర్సీ ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఎంసి జారీ చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు, ఆరోగ్య మహిళ వంటి ఇతర ఆరోగ్య కార్యక్రమాలలో సైతం పీజీ వైద్య విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ఇదిలా ఉండగా, డీఆర్సీ కార్యక్రమంలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులను ముందుగా ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు అటాచ్ చేయాలని భావించారు. అయితే, అందుకు పీజీ వైద్య విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము వైద్య విద్య సంచాలకుల పరిధిలోకి వస్తామనీ, అలాంటప్పుడు డీఎంహెచ్‌వోల పరిధిలోకి ఎలా తీసుకొస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పీజీ వైద్య విద్యార్థుల పనితీరు, వారిపై పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా ఆసుపత్రులలోని సూపరింటెండెంట్‌లకు అప్పగించినట్లు తెలిసింది.
పీజీ వైద్య విద్యార్థుల బాధ్యతలను ప్రతీ మూడు నెలలకోసారి రొటేషన్‌పై మార్చే అధికారం సైతం సూపరింటెండెంట్‌లకే అప్పగించారు. కాగా, పీజీ వైద్య విద్యార్థులు జిల్లా ఆసుపత్రులలో బ్యాచ్‌ల వారీగా పని చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు బలోపేతం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.