హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోనూ కేర్ గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు వైద్య సేవలను అందించనున్నాయి. ఇందుకు ఔరంగాబాద్‌కు చెందిన సిగ్మా ఆసుపత్రులతో కేర్ ఆసుపత్రుల గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం సంతకాలు పూర్తయ్యాయి. తాజా ఒప్పందంతో మహారాష్ట్రలో కేర్ ఆసుపత్రుల నాణ్యమైన వైద్య సేవలు అక్కడి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని కేర్ సీఈవో జస్‌దీప్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
దశాబ్ద కాలంగా సిగ్మా ఆసుపత్రులు మరఠ్వాడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయని, కేర్ ఆసుపత్రులతో జరిగిన తాజా ఒప్పందంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయని సిగ్మా ఆసుపత్రుల సీఎండీ డా. ఉన్మేష్ తక్కల్కర్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పలు నగరాల్లో కేర్, సిగ్మా ఆసుపత్రుల భాగస్వామ్యంతో మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు ఆసుపత్రుల సీఈవోలు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.