న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హోటళ్లు, రెస్టారెంట్లలో ఇచ్చే బిల్లుల్లో సర్వీస్ చార్జ్‌ను చేర్చరాదని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జిని బిల్లులో భాగంగా చేయడంపై సీసీపీఏ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ ఎవరైనా సర్వీస్ చార్జిని బిల్లులో పొందుపరిస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వినియోగదారులు నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ 1915కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే ఈ-దాఖిల్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సీసీపీఏ తెలియజేసింది. సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో సర్వీస్ చార్జ్ అంశంపై మరింత స్పష్టతనిస్తూ.. ఇది కేవలం వినియోగదారుడి ఐచ్ఛికం మాత్రమే తప్ప తప్పనిసరి చేయరాదని తేల్చిచెప్పింది. వేర్వేరు పేర్లతో సర్వీస్ చార్జ్ వసూలు చేయడాన్ని సైతం సీసీపీఏ గుర్తించింది. వినియోగదారుడి విచక్షణ మేరకు సర్వీసు చార్జిని స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి తప్ప చెల్లించాలని వసూలు చేయడం కుదరదని స్పష్టంచేసింది.
సర్వీస్ చార్జ్ సహా వినియోగదారులకు సంబంధించి ఏ అంశంలోనైనా సమస్యలు, ఫిర్యాదులుంటే నేరుగా వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా సర్వీస్ చార్జికి సంబంధించినవే ఉన్నాయని, అందుకే కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో బిల్లులో సర్వీస్ చార్జి కలిపేస్తున్నారని, ఎవరైనా వినియోగదారుడు చెల్లించడం కుదరదంటే అతణ్ణి అవమానిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీస్ చార్జ్ ప్రస్తావన ఉండకూదని సీసీపీఏ తేల్చి చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.