రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారుచేస్తామంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కాంట్రాక్ట్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దగ్గర ఉంది. ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి అయిన వ్యాక్సిన్లను కూడా రెడ్డీస్ ల్యాబ్స్.. అపోలో హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తోంది.
అయితే ఈ వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని బుధవారం డీసీజీఐకి సీరం దరఖాస్తు చేసుకున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థ ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. ఇదే కాకుండా అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ వ్యాక్సిన్‌లను కూడా తయారు చేయనుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు గత ఏప్రిల్ నెలలోనే డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.