హైదరాబాద్, ఆంధ్రప్రభ : మిర్చి ఆధారిత ఉత్పత్తుల విక్రయాలు జరిపేందుకు కేరళలోని కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ లిపిడ్ అనే అంతర్జాతీయ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఒప్పంద పత్రాలపై గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్ సంస్థ ఎండి జాన్ నేచు పాదం సంతకాలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించే మిర్చి పంటలను సెర్ప్ – మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న 56 రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఈ సంస్థ ద్వారా రూ. 60 కోట్ల మేర మిర్చి వ్యాపారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళ సంఘాల ద్వారా తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను ప్లిప్‌కార్ట్ సంస్థ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థతో జరిగిన ఒప్పంద సంబంధాలు బాగా నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే మిర్చి ఆధారిత ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి ప్లాంట్ లిపిడ్ సంస్థతో జరిగిన ఒప్పందం వలన మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.