Friday, November 22, 2024

Delhi | వరుస ప్రమాదాలు అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి : జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో కొద్ది నెలల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో అభద్రతాభావాన్ని కల్గిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన ఆయన, లేఖలోని అంశాలను మీడియాకు విడుదల చేశారు. హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతపై విస్తృతస్థాయిలో సమీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరారు.

- Advertisement -

జూన్ నెలలో ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 280 మంది మరణించిన ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతుండగా.. తాజాగా వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో అలమంద – కంటకపల్లె మధ్య చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందారని గుర్తుచేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో కేవలం ఐదు నెలల వ్యవస్థలో రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ నివాసిగా, రాజ్యసభ సభ్యునిగానే కాక ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యునిగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రైలు ప్రయాణాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు త్వరితగతిన స్పందించి వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నందుకు  రైల్వే మంత్రికి, ప్రధాన మంత్రికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల భద్రత, భారతీయ రైల్వేల రక్షణ విషయంలో జాతీయస్థాయిలో నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement