న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబర్ 28కి వాయిదా పడింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. దీంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలపై దాఖలైన పలు వ్యాజ్యాలు జతకలిసి వచ్చాయి. ఈ సందర్భంగా రెండూ వేర్వేరు అంశాలని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, మాజీ అడ్వొకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్లను డీ-ట్యాగ్ (విడదీయాలని) చేయాలని కోరారు. అయితే డీ-ట్యాగ్ చేయకుండానే తదుపరి విచారణ చేపట్టే రోజు విడివిడిగా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు రాజధానుల వ్యవహారంపై మొత్తం 8 పిటిషన్లు, విభజన వివాదాలపై 28 పిటిషన్లు దాఖలయ్యాయి.
వికేంద్రీకరణ అంటే అమరావతి అభివృద్ధి జరగదని కాదు: ఏపీ ప్రభుత్వం
మూడు రాజధానుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ హైకోర్టు తీర్పును తప్పుబడుతూ అనేకాంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పుపై ‘స్టే’ విధించాలని పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని, శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని వెల్లడించింది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని తెలిపింది. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని కూడా వెల్లడించింది.
2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే జరిగాయని, అవి కూడా తాత్కాలిక ప్రాతిపదికన జరిగినవేనని తెలిపింది. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని నిర్మాణానికి రూ. 1,09,000 కోట్లు ఖర్చవుతుందని, అదే రాజధాని వికేంద్రీకరణ చేపడితే అయ్యే మొత్తం ఖర్చు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమేనని తెలిపింది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని, వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదని స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తామని, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందని వివరించింది.
సుప్రీం దృష్టికి కోర్టు ధిక్కరణ పిటిషన్లు
సోమవారం నాటి విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ల గురించి మాజీ అడ్వొకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని వ్యాఖ్యానించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనానికి వివరించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే అన్ని అంశాలను ఈ నెల 28న చేపట్టే విచారణ సందర్భంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.